బీర్పూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్ల సాగు పెంచడానికి క్వింటాల్ కి రూ.500 బోనస్ ఇస్తుందని, రైతులు దొడ్డు రకం వడ్ల సాగు చేయకుండా ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే కాదని రైతులు ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగమే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నలకు రూ.2400 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కి రూ.800 నష్టం భరించాల్సి వస్తుందని అన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని, రైతుకు పెట్టుబడి సాయంగా రెండో విడత రైతుబంధు నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని తద్వారా ఆదాయం పొందుతారని అన్నారు. రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, శాస్త్రవేత్తల ద్వారా సాగు మెలకువలు తెలుసుకొని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేడీసీసీ జిల్లా సభ్యులు ముప్పాళ్ళ రామచంద్రరావు, ఎంపీడీవో భీమేశ్, ఎమ్మార్వో సుజాత, సర్పంచ్ హరీష్, మాజీ పాక్స్ చైర్మన్ నవీన్ రావు, నారపాక రమేష్, రవి, బీర్పూర్ ఆలయ ఛైర్మెన్ శ్రీనివాస్, సర్పంచులు సుశీన్, రాజకుమార్, లక్ష్మణ్, శేఖర్, శ్రీనివాస్, సతీష్, సురేందర్, సాగర్ , APM, అధికారులు, ఉప సర్పంచ్ లు, తదితరులు పాల్గొన్నారు.