ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌లో ఉన్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో శుక్రవారం (10.04.2026) ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99) రోజుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా దివ్యాంగులకు రూ.18.80 లక్షల విలువ గల 16 రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాలు, రూ.2.70 లక్షల విలువ గల ఒక మినీ ట్రేడింగ్ ఆటోను పంపిణీ చేశారు. అదనంగా, పోషణ అభియాన్‌లో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు.
అలాగే పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించి, పోస్టర్లను విడుదల చేశారు. ప్రీ-స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందిస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే స్మార్ట్ ఫోన్లను వినియోగించి అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.
అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ల ద్వారా నివేదికలు వేగంగా సిద్ధం చేసి సేవల నాణ్యతను పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాకాడే, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాస్, సీడీపీఓ శ్రీలత, జిల్లా మేనేజర్ సుధారాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఎం. సరస్వతి, సర్పంచులు, అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.