- నర్సింగ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు.
- గ్రామీణ యువతులను నర్సులుగా తీర్చిదిద్దుతాం.
- రెండేండ్లలోనే 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం.
- గతేడాది 6956 నర్సింగ్ ఆఫీసర్ల నియామకం.
- ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ వైద్య రంగంలో కీలకమైన నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గతేడాది 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామన్న ఆయన మరో 2322 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రెండేండ్లలోనే 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నర్సులకు ఉద్యోగావకాశాలు కల్పించామని పేర్కొన్నారు.దేశ, విదేశాల్లో నర్సింగ్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఇక్కడి యువతకు అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. గ్రామీణ యువతులను నర్సులుగా తీర్చిదిద్ది, దేశ విదేశాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా, నర్సులే రోగులకు సేవలు అందిస్తున్నారని, కోట్ల మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడటంలో కీలక పాత్రను పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇచ్చి, వారి ఆకాంక్షలను నెరవేర్చామని మంత్రి వెల్లడించారు.భవిష్యత్తులోనూ నర్సింగ్ ఆఫీసర్లకు అండగా ఉంటామని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు సేవలు అందిస్తున్న నర్సులకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఎంతో మంది నర్సులు పేషెంట్లతో ప్రేమగా మాట్లాడి, వారికి మనో ధైర్యాన్ని కల్పిస్తున్నారని, అలాంటి నర్సులను మిగతా వారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడి, బాధలో ఉంటారని, అలాంటి వారితో ఒక్కమాట ప్రేమగా మాట్లాడితే ఎంతో ఉపశమనం పొందుతారని మంత్రి గుర్తు చేశారు.నర్సుల పని ఒత్తిడిని రోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకుని, వారికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.