ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఓడినా ఆయన తీరు మారలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే రామారావు పటేల్ విమర్శించారు. ఈ మేరకు భైంసాలో మీడియా తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ప్రొసీడింగ్ లకు నేను నిధులు తెచ్చాను అని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చెప్పటం, సిగ్గుచేటని ఇకనైనా దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ సూచించారు. ఇలాంటి నీచ రాజకీయాలు ఏ మాజీ ఎమ్మెల్యేలు చేయలేదని, ఓడిపోయినా అధికారం ఉందన్న భ్రమలో విఠల్ రెడ్డి గడుపుతున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో రూ.16.45 కోట్ల నిధులతో 164 మహిళా సమైక్య భవనాల నిర్మాణం, షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే చెప్పుకోవడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజలు తనకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని, నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా అది తాను చేసినట్టేనని చెప్పారు. పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయకుండా జిరాక్స్ కాపీలను పట్టుకొని ప్రజలను మభ్యపెడితే సహించేది లేదన్నారు. అధికారం పోగానే, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి చిల్లర రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కి తగిన శాస్తి చెబుతామన్నారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వారికి కాస్త ఓపిక సహనం ఉండాలన్నారు.