Take a fresh look at your lifestyle.

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా దీపక్ తివారి -పదవీ బాధ్యతలు స్వీకరణ

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా దీపక్ తివారి శనివారం సాయంత్రం ఐడీఓసి కార్యాలయంలోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజేశ్వరి, ఎసి ఎల్ బి సుధీర్, ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి, నూతన కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.
అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్‌గా పని చేసే అవకాశం లభించడం తనకు గౌరవంగా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాల మేరకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకత, విద్యా, వైద్యం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుని సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ వేగవంతమైన సేవలందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాల్లో సమగ్రంగా ముందుకు సాగాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.
శాఖల వారీగా, మండలం వారీగా రివ్యూ చేస్తానని, మీరు చేపట్టే పనులు అభివృద్ధి ఫోటోలు మరియు పూర్తి వివరాల తో నోట్ సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో డి ఆర్ ఓ మంగీ లాల్, ఆర్ డి ఓ వాసు చంద్ర, కాడ అభివృద్ధి అధికారి వెంకట్ రెడ్డి, డి ఆర్ డి ఎ శ్రీనివాస్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.