Take a fresh look at your lifestyle.

నేషనల్ గ్రీన్ కార్ప్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ డైరెక్టర్‌ను కలిసిన ప్రిన్సిపల్ మదన్ మోహన్

జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో ఎంఓయూ ఒప్పందం

నాగర్ కర్నూల్: జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నేషనల్ గ్రీన్ కార్ప్స్ (NGC) తెలంగాణ డైరెక్టర్ డబ్ల్యూ.జి. ప్రసన్నకుమార్‌ను నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల (నోడల్ కళాశాల) ప్రిన్సిపల్ మదన్ మోహన్ కలిసి భేటీ అయినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ శాఖతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడం, పచ్చదనం ప్రోత్సాహం, స్వచ్ఛత కార్యక్రమాలు, వృక్షారోపణ వంటి కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించనున్నారు
ప్రిన్సిపల్ మదన్ మోహన్ మాట్లాడుతూ, ఈ ఒప్పందంతో కళాశాలల్లో గ్రీన్ క్లబ్ కార్యకలాపాలు మరింత చురుకుగా సాగడంతో పాటు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రాయోగిక శిక్షణ అందే అవకాశం ఉంటుందని తెలిపారు.

అలాగే, నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ దినోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు.

ఈ చర్యల ద్వారా యువతలో పర్యావరణంపై బాధ్యతాభావం పెంపొందించి, సమాజంలో పచ్చదనం పరిరక్షణకు తోడ్పడేలా ప్రోత్సహించడమే లక్ష్యమని ఆయన వివరించారు.

Leave A Reply

Your email address will not be published.