Take a fresh look at your lifestyle.

మక్తల్ మినీ స్టేడియం పూర్తయితే జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తాం -మంత్రి వాకిటి శ్రీహరి

 

-కబడ్డీ పురుషుల జట్టు విజేత వనపర్తి…. మహిళల జట్టు విజేత గద్వాల్

– ముగిసిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

-విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి

ముద్ర, నారాయణపేట:

మక్తల్ మినీ స్టేడియం మైదానాన్ని రూ. 25 కోట్లతో నిర్మించే జాతీయస్థాయి క్రీడలను నిర్వహిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సీఎం కప్ రెండవ ఎడిషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు మక్తల్ పట్టణంలో ప్రశాంతంగా ముగిసాయి. గత శుక్రవారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో 33 జిల్లాల నుండి 66 టీంలు సుమారు 1200 మంది క్రీడాకారులు,కోచ్ లు,వారి సహాయకులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి డా. వాకిటి శ్రీహరి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. సీఎం కప్ క్రీడలు జాతీయస్థాయిలో క్రీడాకారులు రాణించేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. కాగ సోమవారం పురుషుల,మహిళల జట్ల ఫైనల్ మ్యాచ్ లు హోరాహోరీగా జరిగాయి. మహిళల విభాగంలో గద్వాల జట్టు వర్సెస్ రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 36-31 పాయింట్ల తేడాతో గద్వాల విజేతగా నిలిచింది, మూడవ స్థానం కోసం కరీంనగర్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 37-18 పోయింట్ల తేడాతో కరీంనగర్ మూడవ స్థానం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో వనపర్తి జట్టు రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 39-16 పాయింట్ల తేడాతో వనపర్తి జట్టు విజయం సాధించి మొదటిస్థానం లో నిలిచింది. మూడవ స్థానం కోసం జరిగిన పోటీలో గద్వాల జట్టు వర్సెస్ మేడ్చల్ జట్ల మధ్య జరిగిన పోరులో 39-32 పోయింట్ల తేడాతో గద్వాల జట్టు మూడవ స్థానం కైవసం చేసుకుంది. విజేతలకు బహుమతులతో పాటు నగదు పురస్కారం అందించి అభినందించారు. డివైఎస్ఓ శెట్టి వెంకటేష్, డీఈవో గోవింద రాజులు, మక్తల్ మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస, వైస్ ఛైర్మన్ శైవి రెడ్డి, జిల్లాలోని పిడి, పిఈటిలు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.