మూడు నెలల్లో సొంత పార్టీ
మహూర్తం కోసం ఎదురుచూస్తున్నాం
ఈ నెల 12న జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ
కావాలనే ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీత
తెలంగాణ జాగృతి చీఫ్ కవిత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మూడు నెలల్లో తన సొంత పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. అందుకు మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని చెప్పారు. పార్టీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో బలీయశక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈనెల 12న ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆమె కోరారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గౌరవించడం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఈ సభ లక్ష్యమని పేర్కొన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు చిన్న చేపలను పట్టుకుని పెద్ద చేపలను వదిలేస్తున్నారని విమర్శించారు. కావాలనే ఈ కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేయమని ఆదేశాలిచ్చిన పెద్ద చేపను వదిలేసి.. ప్రణీత్ రావు లాంటి చిన్న చేపను సిట్ అధికారులు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. సిట్ దర్యాప్తు తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం డిమోట్ చేసిందని చెప్పారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌కు ఒక పుస్తకం ఉటుందని కవిత అన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు. రాజకీయ విమర్శలు ఒక లైన్ దాటి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయని కవిత అన్నారు. ఒక జాతిని, నాయకులను అవమానించే వ్యాఖ్యలు హర్షించదగినవి కావని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చిందని కవిత అన్నారు. గత రెండు బడ్జెట్లలో ఈ హామీ పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. 2025-26 బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు కేటాయింపులు పెరిగినప్పటికీ, జనాభా నిష్పత్తి ప్రకారం రూ.20 వేల కోట్ల హామీకి దూరంగా ఉందని చెప్పారు. బీసీ మేధావులు, సంఘాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే చట్టబద్ధ బీసీ సబ్ ప్లాన్ డిమాండ్ చేస్తున్నాయన్నారు. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై కసరత్తు చేయాలని, హామీలను సవరించుకోవాలని విమర్శలు వినిపిస్తున్నాయని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అన్ని పార్టీల వ్యవహారాన్ని గమనించాలని సూచించారు. మంచి చేసే నాయకుడికే ఓటు వేయాలని కోరారు. ప్రశ్నించే నాయకులు, సీపీఎం, స్వతంత్రులకు తమ మద్దతు ఇవ్వాలని వాదనలు వినిపిస్తున్నాయని తెలిపారు.