Take a fresh look at your lifestyle.

ఉద్యమ ద్రోహులకు కొమ్ముకాస్తోన్న బీజేపీ -రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో దోస్తీ

ముద్ర, హుస్నాబాద్ :

గత రెండేళ్లుగా బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం… తెలంగాణలో ఉద్యమ ద్రోహులకు కొమ్ముకాస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కించపరిచే శక్తులతో బీజేపీ జతకట్టడం మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమీ భయానికి అద్దం పడుతోందని విమర్శించారు. మేధావులు, ఉద్యమకారులు ఈ కుట్రను గమనించాలని కోరారు. శుక్రవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. “తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంగా అభివర్ణించి, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందన్న వ్యక్తితో బీజేపీ పొత్తు పెట్టుకోవడం పై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఇప్పుడు కొండగట్టుకు వచ్చి ఎన్ని పూజలు చేసినా, అభివృద్ధి మాటలు చెప్పినా.. తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ ఉద్యమ వ్యతిరేకి గానే చూస్తుందని స్పష్టం చేశారు. ఫెడరల్ వ్యవస్థలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు కానీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారిని ఇక్కడి ప్రజలు ఆమోదించరని హితవు పలికారు. హుస్నాబాద్‌ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా వెళ్లాలంటే పాలకవర్గంలో అధికార పార్టీ ఉండాలని పేర్కొన్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి బలాన్ని ఇవ్వాలని ఓటర్లను కోరారు. పట్టణం పెరిగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, హుస్నాబాద్‌ను పెద్ద నగరంగా మార్చే కార్యాచరణతో ముందుకు పోతున్నామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్ప మంత్రి.. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ప్రత్యేక అభివృద్ధి చూపిస్తామని హామీ ఇచ్చారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు రుణమాఫీ వంటి ప్రజా పాలన పథకాలు చూసి హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.