Take a fresh look at your lifestyle.

ఎన్నికల్లో పోటీ చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే -మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్

డబ్బుల మయంగా మున్సిపల్ ఎన్నికలు
మా పదవులు మీ ఓట్లకు పుట్టాయి
మార్కెట్‌లో కొనుక్కుంటే దొరికేవి కావు

ముద్ర, మేడ్చల్ :

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్ధులు తమ ఆస్తులు అమ్ముకోవడమో… కుదవ పెట్టుకోవడమో చేయాల్సిన దుస్థితి నెలకొందని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు పూర్తిగా డబ్బుల మయంగా మారాయన్నారు. ఓటుకు డబ్బులు ఇచ్చి ఎన్నికల్లో కొట్లాడేవాడు.. మళ్లీ డబ్బుల కోసం ఆరాటపడుతాడని చెప్పారు. మా పదవులు మీ ఓట్లకు పుట్టాయి తప్ప,మార్కెట్‌లో కొనుక్కుంటే దొరికేవి కావని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్ పూరలోని 10,11వ వార్డుల అభ్యర్థులు తుంకి జ్యోతి భాస్కర్, గోవర్ధన్ రెడ్డిలకు మద్దతుగా ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందేనన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పెరిగే చెట్టు, కట్టిన స్మశాన వాటిక, తడి చెత్త పొడి చెత్త షెడ్డు, చౌరస్తాలా వెలిగే బల్బులు, చివరికి మున్సిపాలిటీ కార్మికులకు జీతాలకు కూడా డబ్బులు కేంద్రం నుంచే వస్తాయని చెప్పారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలకు అత్యధిక నిధులను ఇప్పించి, సమగ్రాభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని ఈటల రాజేందర్ హామి ఇచ్చారు. పెన్షన్ల కోసంరూ.12వేల కోట్లు ఇస్తున్న రాష్ట్ర సర్కార్… మద్యం ద్వారా రూ.50 వేల కోట్లు సంపాదిస్తుందని ఆరోపించారు. చిరు వ్యాపారులు, చిన్న కంపెనీ ఉద్యోగులు, సంపాదించిన సంపాదనలో సగం డబ్బులు తాగుడుకే పోతున్నాయని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు దుద్ది శ్రీనివాస్, సామరంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శేఖర్ యాదవ్, రాధిక, ఎలక్షన్ ఇంచార్జి హనుమాన్, షామీర్పేట్ మండలం ప్రెసిడెంట్ కృష్ణ ముదిరాజ్, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, శామీర్పేట సర్పంచ్ సుదర్శన్, మహిపాల్ రెడ్డి, అన్నారం కార్పొరేటర్ ప్రేమేశ్వర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.