Take a fresh look at your lifestyle.

ఇంకెన్నాళ్ళీ అడెల్లి రోడ్ దుస్థితి…? పూర్తికాని ఘాట్ రోడ్డు పనులు వాహనదారులకు తప్పని తిప్పలు

బోథ్, ముద్ర:

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గాన్ని నిర్మల్ జిల్లాతో అనుసంధానం చేసే బోథ్ – అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్న నేటికి పూర్తి కాకపోవడంతో ఈ మార్గం గుండా ప్రఖ్యాత అడెల్లి పోచమ్మ ఆలయ దర్శనానికి వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోథ్ మండలం లోని రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఉన్న సుమారు ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ఆర్ఐడీఎఫ్ – ఎక్స్ ఎక్స్ వీఐ కింద రూ. 9.80 కోట్లను మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఘాట్ కటింగ్ పనులు పూర్తి చేశారు.రోడ్డు పై మట్టి, మొరం పోయించి తాత్కాలికంగా రాకపోకలకు వీలు కల్పించారు. ఘాట్ ప్రాంతంలో రోడ్డు పూర్తి కాకపోవడంతో రోడ్డు పై అడుగడుగున గుంతలు పడి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షకాలమైతే ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే వాహనదారులు జంకు తున్నారు. ఘాట్ ప్రాంతంలో సుమారు అర కిలోమీటర్ల వరకు సీసీ రోడ్డు నిర్మాణం మంజూరు అయినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో పనులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి త్వరితగతిన ఘాట్ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఈ మార్గం గుండా రాకపోకలను కొనసాగించే వాహనదారులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.