ముద్ర ప్రతినిధి, నిర్మల్:
విజ్ఞాన శాస్త్రంతో మెరుగైన జీవితానికి బాటలు వేసుకోవచ్చని డీఈఓ దర్శనం భోజన్న అన్నారు. జిల్లా విద్యాశాఖ, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో 8, 9 విద్యార్థులకు జిల్లాస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ స్థానిక జె వి ఎన్ ఆర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ టాలెంట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని, కఠినతరమైన అంశాల పైన నైపుణ్యత వస్తుందన్నారు. చిన్నతనం నుంచే జీవితంలో సైన్స్ పట్ల అభిరుచి పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లాలోని 19 మండలాల నుంచి 57 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉర్దూ మీడియం విభాగంలో10 పాఠశాల నుంచి 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జడ్పీ సెకండరీ పాఠశాల, తానూర్ కు చెందిన షేక్ అద్నాన్, ఖానాపూర్ బాలికల జడ్పీ పాఠశాలకు చెందిన ఆర్ నందిని, జడ్పీ సెకండరీ స్కూల్ నర్సాపూర్ కు చెందిన మహావీర్ లు రాష్ట్రస్థాయి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నారాయణ వర్మ, బచ్చు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కూన రమేష్, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రఫీక్, సంఘ బాధ్యులు వందన, దేవేందర్, నబీ, ఫయీజుద్దీన్, సుధాకర్ పాల్గొన్నారు.