Take a fresh look at your lifestyle.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ మరోసారి వాయిదా

మూడు వారాలు దాటితే ధిక్కరణ చర్యలు
అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఆల్టీమేటం
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ మరోసారి వాయిదా
స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను వివరించిన ప్రభుత్వ న్యాయవాది
ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ తరపు లాయర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోన్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ మరో మూడు వారాలకు వాయిదాపడింది.
ఈ వ్యవహారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గత విచారణలోనే సుప్రీంకోర్టు.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా శుక్రవారం మరోసారి ఈ కేసుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పార్టీ మార్పుకు సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను.. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ మను సింఘ్వీ…. జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ ప్రసాద్ కుమార్.. ఇప్పటికే విచారణ చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు పార్టీ మారినట్లు పేర్కొన్న పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందికి సంబంధించి స్పీకర్ క్లీన్‌చీట్ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి మరింత సమయం పడుతుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకు వచ్చే నెల మధ్య నాటికి సమయం ఇవ్వాలని సింఘ్వీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు మరోసారి గడువు ఇవ్వాలని కోరిన సింఘ్వీ వాదనపై బీఆర్ఎస్ పార్టీ తరఫు న్యాయవాది మోహిత్‌రావు అభ్యంతరం తెలిపారు. కడియం, దానం ఎమ్మెల్యేల విషయంలో వారు పార్టీ మారినట్లు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు విన్నవించారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారణ జరపడానికి ఇంకా ఏమీ లేదని పేర్కొన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినట్లు తెలిపారు. మొదట నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పి.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పేరుతో మరోసారి సాకులు వెతుకుతున్నారని కోర్టుకు తెలిపారు. అదే సమయంలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తె కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీకి ప్రచారం చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఎమ్మెల్యేలు అందరూ తాము ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని.. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెబుతున్నారని కోర్టుకు నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం.. ఈ కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఆ గడువులోగా స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే.. దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని పేర్కొంది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మూడు వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది. స్పీకర్ పాటించని పక్షంలో అప్పుడే ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామని వెల్లడించింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పది మంది ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్ పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్) మినహా అందరికీ క్లీన్ చీట్ ఇచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18,19 తేదీల్లో కడియం, దానంలను మళ్లీ విచారిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.