Take a fresh look at your lifestyle.

అవసరం కాబట్టే కాళేశ్వరానికి మార్చాం

  • అక్కడ నీరు తక్కువ ఉంటాయి.. అందుకే మేడిగడ్డకు మార్పులు చేశాం.
  • ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్రను ఒప్పించాం.
  • కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీరిచ్చాం.
  • యాసంగిలో పండిన పంటలన్నీ కాళేశ్వరం నీళ్లతోనే.
  • కాళేశ్వరం కమిషన్​ విచారణకు బరాబర్​ వెళ్తాం.
  • మీవి దొంగ లెక్కలు.. అసలైన లెక్కలు నా దగ్గరున్నాయి.
  • కమిషన్ ఎదుట సంచలన విషయాలు వెల్లడిస్తా.
  • కాళేశ్వరంపై తెలంగాణ భవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్  లో మాజీ మంత్రి హరీశ్ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం రాష్ట్రానికి జీవనధార  ప్రాజెక్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.అలాంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం  సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రయత్నించడం శోచనీయమని ధ్వజమెత్తారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని కాళేశ్వరం ప్రాజెక్టుపై డాక్యుమెంట్ రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి పార్టీ విషయాలు, రాజకీయాలు లేవన్నారు.ఇది కేవలం ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టు  అని స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు, వాస్తవాలు పేరిట  తెలంగాణ భవన్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తం 20 లక్షల 33 వేల 572 ఎకరాలకు సాగునీరు అందిస్తే, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా 20 లక్షల పైగా ఎకరాలకు సాగు నీరు అందిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్ ఇంజనీర్స్ నివేదికలు కూడా  ఇచ్చారన్నారు. అయినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తుండడం పట్ల ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించాలని చూసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా కేవలం 11 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వకు అవకాశం ఉండేదన్నారు. కానీ కేసీఆర్  ముందు చూపుతో  కాళేశ్వరం ద్వారా 141 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా 16 రిజర్వాయర్లు నిర్మించామన్నారు.మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బుస్సాపూర్, గంధమల్ల, కొండం చెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉందన్నారు. ఒక్క మల్లన్న సాగర్ లోనే 50 టీఎంసీల నీటి నిల్వ ఉంటుందన్నారు.దీని  కారణంగానే  ఎస్సారెస్పీకి నీళ్లు రానపుడు, కడెం నిండకుండా ఎల్లంపల్లికి కూడా  నీళ్లు రానపుడు కూడా మేడిగడ్డలో నీళ్లుంటున్నాయన్నారు.ఎక్కడా నీళ్లు లేనపుడు కూడా నీళ్లు లభ్యమయ్యే పాయింట్ మేడిగడ్డ అని అన్నారు.వర్షాలు బాగా కురిసినపుడు ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నామన్నారు.  మిడ్ మానేర్ లో పంప్ చేసి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ వరకు నీళ్లు తెచ్చామని హరీశ్ రావు వివరించారు కాళేశ్వరంలో అంతర్భాగమైన వీటి అంతటా లక్షల ఎకరాల్లో పంటలు పండాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్లు, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో  రంగనాయక సాగర్ కు నీళ్లు, రంగనాయక సాగర్ మోటార్లతో మిడ్ మానేర్ కు నీళ్లొచ్చాయన్నారు. మిడ్ మానేర్ మోటార్లతో మల్లన్నసాగర్ కు, అక్కడి మోటార్లతో  కొండ పోచమ్మ సాగర్ కు నీళ్లిచ్చామన్నారు. ఇదంతా కాళేశ్వరంలో భాగంగానే.. లక్షల ఎకరాల్లో పంట పండిందన్నారు. అయినప్పటికీ కాళేశ్వరం కింద ఒక్క ఎకరా పారలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం సిగ్గుచేటని విమర్శించారు. అలాగే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 50 వేల ఎకరాలు మాత్రమే అన్నారన్నారు.ఇంకో కాంగ్రెస్ నాయకుడేమో లక్ష ఎకరాలే పారింది అంటాడని విమర్శించారు.ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఒక్కో నాయకుడు ఒక్కో లెక్క చెబుతాడన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2, నిజాంసాగర్ నీటితో నింపిన 2143 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 1 లక్షా 67 వేల కొత్త ఆయకట్టు సాగయిందన్నారు. ఎస్సారెస్పీ స్టేజీ 1, ఎస్సారెస్పీ స్టేజీ 2, నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీరందించి 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరిగిందన్నారు. కాళేశ్వరం నీళ్లు కూడెల్లి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20 వేల 576 ఎకరాలకు సాగునీరందిందని హరీశ్‌ రావు వివరించారు.
  • అక్కడ నీటి లభ్యత ఉండదు.
ప్రాణహిత చేవెళ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకో రూ.20 వేల కోట్లు పెడితే అయిపోతుండె అని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు.దీనిపై లెక్కలు తీస్తే కేవలం రూ.3700 కోట్లు మాత్రమే కాంగ్రెస్ ఖర్చు చేసినట్లు తేలిందన్నారు. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టు ఖర్చు పెరిగిందని  కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.వాస్తవానికి 2007లో రూ.17,875 కోట్లకు జీవో ఇచ్చి, ఏ పని చేయకుండానే ప్రాజెక్టు ఖర్చును రూ.38,500 కోట్లకు పెంచింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.ఆ తర్వాత కేంద్రానికి పంపినపుడు రూ.40,300 కోట్లకు పెంచింది కూడా ఇదే కాంగ్రెస్ నాయకులేనని అన్నారు.ఇది కాంగ్రెస్  నిర్వాకమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తుమ్మిడిహెట్టి వద్ద నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేద్దామనుకున్నారు. కానీ నీటి లభ్యత లేని కారణంగా తమ్మిటిహెట్టి నుంచి మేడిగడ్డ అక్కడి నుంచి అన్నారం, అటు నుంచి సుందిళ్లకు అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించామన్నారు.కాళేశ్వరానికి మేడిగడ్డ నుంచే నీళ్లు తేవాల్సిన అవసరం లేదన్నారు. ఎస్సారెస్పీకి వరద నీరు వస్తే మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయన్నారు. ఒకటి వరద కాలువ, రెండోది ఎస్సారెస్పీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయన్నారు. మిడ్ మానేరు నుంచి మోటర్ల ద్వారా అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లకు నీళ్లు అందించే అవకాశం ఉందన్నారు. కొన్నిసార్లు కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వస్తాయన్నారు. ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఆన్ చేసి ఎస్సారెస్సీకి నీళ్లు అటు నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. నెల రోజుల్లోనే సాగునీటిశాఖ మంత్రిగా తాను ఉన్న సయమంలో ఇంజనీర్ల బృందం కలిసి మహారాష్ట్రకు వెళ్లామన్నారు.అక్కడ కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ను కలిసి ప్రాజెక్టు నిర్మాణం అవసరాన్ని వివరించామన్నారు. అప్పటి సీఎం పృద్వీరాజ్ చౌహాస్, ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లేఖను గుర్తు చేశారు.
  • మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు.
ఫుల్ రిజర్వాయర్ లెవల్ 152 మీటర్లకు అనుగుణంగా చేపట్టే ప్రాజెక్టు పనులు నిరుపయోగమని, తాము 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే అంగీకరిస్తామని ఆనాడే తేల్చి చెప్పినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు.ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య రెండుసార్లు హైదరాబాదులో చర్చలు జరిగాయన్నారు. ఆనాడు దివంగత ఆర్.విద్యాసాగర్ రావు కూడా పాల్గొని మహారాష్ర్ట ప్రభుత్వం నిర్దేశించిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని కూడా హామీ ఇచ్చారన్నారు. అయితే తుమ్మిడిహెట్టి వద్దనే 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో ప్రాజెక్టు నిర్మించేందుకు బీఆర్ఎస్ ఎంతో ప్రయత్నం చేసిందన్నారు.కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదన్నారు.మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఆనాటి సాగునీటి మంత్రి గిరీష్ మహాజన్ తో తాను ముంబైలో సమావేశమవడం జరిగిందన్నారు.ఈ సమస్యను ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుందని గిరీశ్ సూచించారన్నారు. ప్రాణహిత–చేవెళ్లను ఎందుకు రీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందంటే అక్కడ నీటి లభ్యత లేకపోవడమే కారణమేనని అన్నారు.హైడ్రాలజీ వాళ్లు అక్కడ ప్రాజెక్టుకు సరిపడా నికర జలాలు లేవన్నారు. ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించిందన్నారు.ఉమ్మడి ఏపీలో 2008న రాసిన లేఖలో ప్రాణహిత చేవెళ్ల డీపీఆర్ పై సీడబ్ల్యూసీ స్పందించిందన్నారు.ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం కలిగిన బ్యారేజీలు లేవని, అందుకే కృత్రిమ జలాశయాలను గానీ, ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకోవాలని సీడబ్ల్యూసీ సూచించిందన్నారు.తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేశామని, అవేమీ ఫలించకపోవడంతోనే ప్రత్యామ్నయ స్థలం కోసం ఆలోచన చేశామన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఎంపిక చేసిన స్థలమే మేడిగడ్డ అని పేర్కొన్నారు.
  • ప్రాణహిత సామర్థ్యం 11 టీఎంసీలే.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1480 టీఎంసీల కేటాయింపులుంటే, తెలంగాణ వాటా 969 టీఎంసీలు. కానీ, వాస్తవంగా అందులో తెలంగాణ వాడకం ఏనాడూ 400 టీఎంసీలు మించలేదన్నారు. 2014 వరకు తెలంగాణలో గోదావరిపై కట్టిన ప్రాజెక్టులు ఎస్సారెస్పీ, దేవాదుల మాత్రమేనని అన్నారు.తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా వస్తే, తలొగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు.అక్కడ నీటి లభ్యత ఉండదన్నారు. ప్రాణహిత చేవెళ్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 11 టీఎంసీలు మాత్రమేనని కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు అని అన్నారు. ఇందులో ఎంత తేడా ఉందో కాంగ్రెస్ నాయకులు గమనించాలన్నారు. 2014 వరకు కాంగ్రెస్ నాయకులు సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 2328 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే ఆ పనులే జరగనేలేదన్నారు.  ఇందులో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట రూ. 1052 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాహా చేసిందన్నారు. ఈ విషయంలో స్వయంగా కాగ్ తన రిపోర్టులో వెల్లడించిందన్నారు.
  • అసలు రిపోర్టు ఇదే.
ఒక ఏడాది కరువు వస్తే, ఎస్సారెస్పీకి కూడా నీళ్లను రివర్స్ పంపింగ్ చేశామని హరీశ్ రావు వివరించారు. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండీకి నీళ్లు తెచ్చి, ఎల్ఎండీ ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్ 1 కు నీళ్లిచ్చామన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా నీరందించాం. కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ఇది వాస్తవమైన రిపోర్టు అని అన్నారు.  కానీ కాంగ్రెస్ నాయకులు 50 వేల ఎకరాలే పారిందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
  • భయం లేదు.. విచారణకు  పోతాం.
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వెళ్తామని హరీశ్‌ రావు చెప్పారు. ఇక్కడ ఎవరూ భయపడడం లేదని తెలిపారు. తమకేం భయం లేదని, కమిషన్‌ ఎదుట వాస్తవాలు ఉంచుతామని అన్నారు. బీజేపీకి ఎన్​డీఎస్​ఏ జేబు సంస్థలా మారిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ మాదిరిగా ఎన్ డిఎస్ ఎ వ్యవహరిస్తోందన్నారు. పిల్లర్‌ కుంగితే  రెండు, మూడు రోజుల్లోనే  ఎన్ డిఎస్ ఎ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని చెప్పారు. రేవంత్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం భేషజాలకు పోకుండా.. కుంగిన మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్‌ చేయించాలని కోరారు మాజీ మంత్రి హరీష్‌రావు.
  • ఇదీ కాళేశ్వరం స్వరూపం.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే..3 బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,19 సబ్ స్టేషన్ లు,21 పంప్ హౌజులు,203 కి.మీ సొరంగాలు, 1531 కి.మీ గ్రావిటి కెనాల్,98 కి.మీ ప్రెజర్ మెయిన్స్,141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ,530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ,240 టిఎంసీల నీళ్ల ఉపయోగమన్నారు.మొత్తం మూడు బ్యారేజీలు నిర్మించగా మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగాయి. 85 పియర్స్ ఉన్నాయి. సుందిళ్ల బ్యారేజీలో 74 పియర్స్ ఉన్నాయి. అన్నారం బ్యారేజీలో 64 పియర్స్ ఉన్నాయి. అన్నారం, సుందిళ్లలో అన్ని బాగున్నాయి. మేడిగడ్డలో 5 పియర్స్ లో 2 పిల్లర్లు కుంగాయి. కేవలం అదొక్కటి చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు పనిఅయిపోయిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది.మేడిగడ్డలో 7 బ్లాకులున్నాయి. ఏదైతే బ్లాక్‌లో పియర్స్ ప్రాబ్లం ఉంటే వాటిని రిపేర్ చేపిస్తే సరిపోతుందన్నారు.
  • తుమ్మలను ఎందుకు పిలవరు?
కాళేశ్వరం కమిషన్ ఎదుట బాంబ్ పేలుస్తానని  హరీశ్ రావు సంచలన  వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు సంబంధించి తన వద్ద ఒక కీలక డాక్యుమెంట్ ఉందన్నారు.9న కమిషన్ ముందు హాజరైన తర్వాత అక్కడే మీడియాకు విడుదల చేస్తానన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతం మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ చెప్పిన విషయాలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్థికశాఖతో సమన్వయం చేసుకునే నిధులు తీసుకొచ్చామన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటల రాజేందర్ అనడం సరైంది కాదన్నారు. ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా ఉండదన్నారు. ఈటల రాజేందర్ కు కొన్ని విషయాలు గుర్తు ఉండకపోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కేబినెట్ నిర్ణయంపై ఈటల, తుమ్మల కూడా సంతకం చేశారన్నారు.ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలి కదా? అని కమిషన్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం నియమించిన సబ్ కమిటీలో తనతో పాటు అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారన్నారు.కాగా త్వరలో మరో రెండు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై ఒకటి, గోదావరి బనకచర్ల ప్రాజక్ట్ తో తెలంగాణకు జరుగనున్న నష్టంపై మరో ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. కాళేశ్వరం కమిషన్ తనను ఏది అడిగినా సమాధానం ఇస్తానన్నారు. భయ పడే గుణం కాంగ్రెసోళ్లకు ఉంటది కానీ బీఆర్ఎస్ నాయకులకు కాదన్నారు. బెజవాడ పోయి బజ్జీలు తిని రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.