- టోకెన్ల కోసం ఎగబడుతోన్న జనం.
- ఆది, సోమవారాలు రెండు రోజులు మాత్రమే.
- ప్రత్యేక బస్సులను నడపనున్న ఆర్టీసీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : మృగశిర కార్తె పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆది, సోమవారాల్లో రెండు రోజులు పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి ఏటా బత్తిన కుటుంబం మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ఈ మేరకు శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టోకెన్ల కోసం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే వేలాది మందికి రెండు కౌంటర్లే ఏర్పాటు చేయడం, టోకెన్ల ఆలస్యం కావడంతో క్యూలైన్‌లో ఉన్న జనాలు అసహనం వ్యక్తం చేశారు. చేప ప్రసాదం కోసం వేలాది మంది తరలివస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆదివారం నాడు 60 బస్సులు, సోమవారం నాడు 80 బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, నాంపల్లి, కోఠి, ఈసీఐఎల్క్రాస్రోడ్స్, శంషాబాద్ఎయిర్పోర్ట్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గ్రేటర్లోని 14 డిపోల నుంచి 80 బస్సులు, ఎయిర్పోర్ట్నుంచి 60 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా నార్మల్ రేట్లనే వసూలు చేస్తామని, ప్రయాణికుల సంఖ్యను బట్టి అదనపు బస్సులు నడిపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.