ముద్ర ప్రతినిధి:
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు కవ్వంపల్లి సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, లక్ష్మీకాంత్, యెన్నం శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎస్సీ సెల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కవ్వంపల్లి సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. ఆయన సారథ్యంలో ఎస్సీ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి విద్య ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ ముందుకు సాగుతోందని అన్నారు.

దేశ ఐక్యత, సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.