కళాశాల వార్షికోత్సవాల్లో అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా నూతన కోర్సు, పుస్తకావిష్కరణ – సంబరాలతో అంబరాన్నంటిన విద్యార్థుల ఉత్సాహం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్)లో 2026 సంవత్సరానికి సంబంధించిన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, IAS హాజరయ్యారు. గౌరవ అతిథులుగా వెన్నెల సాహితీ సంస్థ ప్రతినిధి ముచ్చర్ల దినకర్, డా. స్వరూపరాణి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి కళాశాల వార్షిక నివేదికను సమర్పించి, ఈ విద్యా సంవత్సరంలో సాధించిన విశిష్ట విజయాలను వివరించారు. కార్యక్రమంలో భాగంగా కళాశాల అధ్యాపకుడు డా. రాత్లవత్ కృష్ణ రచించిన “తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత” పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.
అలాగే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం మరియు నూతనంగా ప్రవేశపెట్టిన బి.కాం BFSI (AEPD) కోర్సుకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
తదుపరి అతిథులు తమ ప్రసంగాల్లో విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందిస్తూ, విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా అత్యవసరమని సూచించారు. కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా విజయాలపై అవార్డులు, క్రీడా పతకాలు ప్రదానం చేయడంతో పాటు అధ్యాపకులకు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
చివరిగా విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సభలో హర్షాతిరేకాన్ని రేకెత్తించాయి. జాతీయ గీతంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సమక్షంలో ఉత్సాహభరిత వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి.