Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రానివ్వొద్దు-కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

 

 

ముద్ర, జోగుళాంబ గద్వా‌ల‌ జిల్లా ప్రతినిధి:

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ అలంపూర్ తహసిల్దార్ కార్యాలయంలో పలువురు అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఇసుక కొనుగోలు చేయవద్దని, ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేలా సంబంధిత అధికారులు లబ్ధిదారులకు సహకరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం కావాలని, ప్రభుత్వ లక్ష్యం మేరకు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. సెన్సస్ పై ఇప్పటికే జిల్లాలో కార్యకలాపాలు మొదలయ్యాయని, సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తహసిల్దార్ కార్యాలయంలో రికార్డు గది, ఇతర పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం అలంపూర్ మున్సిపల్ కార్మికులు తమకు పెండింగ్ లో ఉన్న జీతాలను ఇప్పించాలని కలెక్టర్ ను కోరారు.  సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అలంపూర్ లోని నిర్మాణంలో ఉన్న పలు ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు.

అనంతరం కలెక్టర్ అలంపూర్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులో తిరుగుతూ పలువురు రోగులు, సహాయకులతో మాట్లాడారు. ఫార్మసీ, ఎక్స్రే, డయాలసిస్ యూనిట్, తదితర విభాగాలను పరిశీలించారు. హాజరు రిజిస్టర్ తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఓపిల సంఖ్య పెరగాలని, సబ్ సెంటర్స్ నుంచి రోగులను రెఫర్ చేయాల్సి వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకే పంపించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రిలో అనవసరమైన ఫర్నిచర్ తొలగించాలని ఆదేశించారు.

 

అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అలంపూర్ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి దీప్తి, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారిని కలెక్టర్ దర్శించుకునీ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి, అమ్మవార్ల ప్రసాదాలను కలెక్టర్ కు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అలంపూర్ దేవాలయాల విశిష్టతను కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అలంపూర్ ఆలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను పెద్ద ఎత్తున పెంచి పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

 

ఈ పర్యటనలో అలంపూర్ మండల ప్రత్యేక అధికారి విమల, తహసిల్దారు ప్రభాకర్, ఎంపీడీవో పద్మావతి, మున్సిపల్ కమిషనర్ శంకర్, ఇతర అధికారులు, తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.