నారాయణపేట జిల్లాలో చిన్నారి హత్య ఘటన – బంగారు, వెండి ఆభరణాల అపహరణ
అయ్యో పాపం చిన్నారిని హత్య చేశారు…!
నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డి పల్లి లో విషాదం
చిన్నారి ఒంటిపై ఉన్న బంగారు వెండి వస్తువుల అపహరణ
ముద్ర, నారాయణపేట:
అల్లారు ముద్దుగా ఆడుకునే వయసుగల ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి చిన్నారి ఒంటిపై ఉన్న బంగారు వెండి వస్తువులను అపహరించుకొని పారిపోయారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డి పల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన అంజయ్య శిరీష పొట్ట కూటికోసం హైదరాబాద్ కు వలస వెళ్లి అక్కడే కూలి పని చేసుకుని ఉండేవారు. వీరికి ఇద్దరు సంతానం కాగ చిన్న కూతురు తేజశ్రీని (5) గ్రామంలోని నానమ్మ తాతయ్య దగ్గర్నే ఉంటూ అంగన్వాడికి వెళ్తుండేది. రాత్రి ఆరు బయట నానమ్మ తాతయ్యతో కలిసి నిద్రించిన చిన్నారి తెల్లవారుజామున గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద స్థానికులకు శివమై కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా డిఎస్పి లింగయ్య, సిఐ శివశంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఆస్తి తగాదాల కోసం చిన్నారిని హత్య చేశారా…. లేదా ఒంటిపై ఉన్న బంగారం వెండి అపహరించేందుకు హత్య చేశారా… మరి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా తెలియాల్సి ఉంది.