Take a fresh look at your lifestyle.

ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణమ్ తప్పనిసరి దాతలిచ్చిన హెల్మెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 

ముద్ర, మహాదేవపూర్:

వాహన దారులు హెల్మెట్ వినియోగం తప్పని సరి చేసుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం గణపురం పోలీస్ స్టేషన్‌లో చక్రవర్తి హాస్పిటల్ వరంగల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్ల ఉచిత పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ దరించకుండా వాహన దారులు నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజ్ చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్ని నియమ, నిబంధనలు విధించినా ప్రజలు వాటిని కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ఉందని అపుడే ప్రమాదాలు నివారించగలమని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ తో పాటు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రాణం పోయిన తర్వాత బాధపడినా ఉపయోగం లేదని, ముందస్తు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడుతాయని తెలిపారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చునేవారు కూడా విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎక్కడైనా వాహనాలు పట్టుకున్నప్పుడు తన పేరు చెప్పినా విడిచిపెట్టవద్దని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. సింగరేణి, ఎఎంఆర్, జెన్కో, మెగా తదితర సంస్థల ద్వారా మరిన్ని హెల్మెట్లు పంపిణీ చేయాలని కోరారు. చక్రవర్తి హాస్పిటల్ అధినేత డా తరుణ్ రెడ్డి 200 హెల్మెట్స్ వితరణ చేయాలని కోరగా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. వ్యాపారవేత్తలు హెల్మెట్స్ వితరణ చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జనవరి మాసం మొత్తం రహదారి భద్రత వారోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యమని, ఒక వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం మొత్తం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వేగ నియంత్రణ పాటించాలని, చలానా వేస్తారనే భయంతో కాకుండా ప్రాణ భద్రత కోసం హెల్మెట్ ధరించాలన్నారు. జిల్లా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదని సూచించారు. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 6500 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు తెలిపారు. రహదారి భద్రతను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జర్నలిస్టులు, ప్రైవేట్ వైద్యులు, శ్రీకాంత్ మిత్ర బృందం ప్రజల ప్రాణ రక్షణ కోసం హెల్మెట్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో సందాని, డిపిఆర్ఓ శ్రీనివాస్, డీఎస్పీ సంపత్ కుమార్, స్థానిక సర్పంచ్, జర్నలిస్టులు, చక్రవర్తి హాస్పిటల్ వైద్యులు తరుణ్ రెడ్డి, శ్రీకాంత్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.