నిధులు ఇచ్చింది మోదీ.. తెచ్చింది బండి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి? : చొప్పదండి ఎన్నికల సభలో బండి సంజయ్ ప్రశ్న
నిధులు ఇచ్చింది మోదీ…. తెచ్చింది బండి
కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి?
ఒక్క హామీనైనా నెరవేర్చిందా?
మున్సిపాలిటీలకు ఐదు పైసలైనా ఇచ్చిందా?
నిధులు ఇచ్చింది మోదీ….తెచ్చింది బండి
రెండేళ్లలో కాంగ్రెస్ ఇచ్చింది గాడిద గుడ్డు
పొరపాటున కాంగ్రెస్ కు ఓట్లేస్తే ట్యాక్స్ పెంచుతారు తస్మాత్ జాగ్రత్త
సర్కార్, పేదల జాగాలు కబ్జా చేసినందుకు బీఆర్ఎస్ కు ఓటేయాలి?
ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే…
చొప్పదండి ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కామెంట్స్…
కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు చొప్పదండిసహా మున్సిపాలిటీల అభివ్రుద్ధికి నిధులిచ్చింది కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమైతే… ఆ నిధులు తీసుకొచ్చి తాము అభివ్రుద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ‘‘రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. 6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఎన్నికలొస్తున్నయని తెలిసి కూడా నిధులు విడుదల చేయలేదు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి’’అని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ స్థలాతోపాటు ప్రజల జాగాలను కబ్జా చేసి అరాచకాలు చేసిన బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండిసహా మున్సిపాలిటీలను అభివ్రుద్ది చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మున్సిపాలిటీ ఎన్నికల ఇంఛార్జ్ సురభి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….
రాష్ట్రంలో చొప్పదండిసహా మున్సిపాలిటీల్లో అంతో ఇంతో అభివ్రుద్ధి జరుగుతోందంటే కేంద్ర నిధులతోనే…. వీధిలో వెలిగే విద్యుత్ లైట్ మొదలు రోడ్లు, డ్రైనేజీ, నీళ్ల సరఫరా, పార్కుల ఏర్పాటు దాకా అన్నీ మోదీగారు ఇచ్చే నిధులతోనే. చొప్పదండికి అమ్రుత్ 2 ద్వారా రూ.36 కోట్ల 30 లక్షలు, 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా రూ.5 కోట్ల 57 లక్షలు స్వచ్ఛ భారత్ ద్వారా రూ.42 లక్షల 66 వేలు కేంద్రం ఇచ్చింది. స్వనిధి ద్వారా 1611 మందికి రూ.2 కోట్ల 94 లక్షల లబ్ది పొందారు. చొప్పదండిలో ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించడంతోపాటు టెన్త్ పరీక్ష ఫీజు చెల్లించాను.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో చొప్పదండి అభివ్రుద్ధి చెందలేదు. అనేక సమస్యలున్నాయి. 2022 లో రూ.33 కోట్లతో ప్రారంభమైన సెంట్రల్ లైటింగ్ రోడ్డు వెడల్పు పనులు ఇంకా పూర్తి కాలేదు.
పట్టణంలో రెండు కోట్ల రూపాయల తో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం ఆగిపోయి మూడేళ్లు అవుతున్న పట్టించుకునే వాళ్ళు లేరు. రోడ్డు పైనే కూరగాయలు, పండ్లు అమ్మకాలు జరుగుతున్న దుస్థితి. పదేళ్ల క్రితం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ఇంకా పూర్తి కాలేదు.చొప్పదండి పట్టణానికి మంచి నీరు రావడం లేదు.పక్కన ఉన్న నగునూరు నుంచి మెషిన్ భగీరథ నీరు తీసుకురావాల్సి ఉండగా 50 కిలోమీటర్లు దూరంలో ఉన్న వేములవాడ మండలం నుంచి భగీరథ నీరు సరఫరా అవుతుంది. పట్టణంలోని కుడి చెరువును ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదు. పట్టణంలోని అంతర్గత రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్న పట్టించుకోవడం లేదు.
చొప్పదండి ఛైర్మన్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి. ఆగిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తా. ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తా. కుడి చెరువును అభివ్రుద్ధి చేయిస్తా. కొత్త రోడ్లను నిర్మిస్తా. చొప్పదండి పట్టణాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తా. చొప్పదండి ఆసుపత్రిని కార్పొరేట్ తరహాలో అభివ్రుద్ధి చేస్తా. వీటితోపాటు వార్డుల వారీగా నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా. ఆలయాలు, బోర్లు, డ్రైనేజీలు నిర్మిస్తా.
ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి. మన టౌన్ అభివ్రుద్ధి తలరాతను మార్చే ఎన్నికలివి. చొప్పదండి అభివ్రుద్ధికి నిధులు తెచ్చిందెవరు? మీ కోసం కొట్లాడిందెవరు? మీకు నిత్యం అందుబాటులో ఉండే నాయకులెవరు?…ఒక్కసారి ఆలోచించండి.
కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? మహిళలకు నెలనెలా రూ.2500లు ఇచ్చారా? తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇచ్చారా? 2 లక్షల ఉద్యోగాలిచ్చారా? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇచ్చారా? ఉద్యోగులకు జీతాలు, డీఏలు, ఈపీఎఫ్ బకాయిలు, , రిటైర్డ్ ఉద్యోగులకు బెన్ ఫిట్స్, పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? నమ్మి చేతి గుర్తుకు ఓటేస్తే.. ఏదో చేస్తారని కళ్లలో ఒత్తులు వేసుకుని చూసిన మాట వాస్తవం. కానీ రెండేళ్లలో నయాపైసా ఇయ్యని మూర్ఖత్వ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి?
రెండేళ్లలో రూపాయి కూడా ఇయ్యనోళ్లు రాబోయే మూడేళ్లలో ఇస్తానంటే ఎలా నమ్మేది? మున్సిపల్ ఎన్నికలొస్తున్నయని ఓట్ల కోసం మళ్లీ దొంగ హామీలిస్తూ మరో 3 ఏళ్లు రాష్ట్రంలో మేమే అధికారంలో ఉంటాం కదా… వాటిని నెరవేరుస్తామంటూ మాయ మాటలు చెబుతున్నారు. ఆ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఝప్తి చేస్తున్నాం. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి గెలిపిస్తే అభివ్రుద్ధి ఆగిపోతుంది. 5 ఏళ్ల నరక యాతన పడతారు….తస్మాత్ జాగ్రత్త.