ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేసుల పేరుతో ఇబ్బందులు పెడితే భయపడేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అప్పుడు కేసులు తిరగబడతాయని హెచ్చరించారు. శనివారం సీఐడీ విచారణ అనంతరం అయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ ఏడాది జనవరి 29న హుజూరాబాద్‍లో సమ్మక్క జాతర సమయంలో గొడవ చోటు చేసుకుంది. పోలీసుల విధుల్లో అడ్డంకి, దూషణలు, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్లు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో ఇటీవల విచారణకు రావాల్సిందిగా సీఐడీ అధికారులు కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ కౌశిక్‌రెడ్డితో పాటు ఆయన భార్య శాలినిరెడ్డి హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు నాలుగు గంటల పాటు అధికారులు విచారణ జరిపారు. విచారణను వీడియో రికార్డు చేశారు.