న్యూఢిల్లీ: గ్రేటర్ వరంగల్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో స్మార్ట్ సిటీ మిషన్ (ఎస్‌సీఎం)కొనసాగించే అవకాశాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 మార్చి 31తో ఈ మిషన్ ముగిసిందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ టోఖన్ సాహూ వెల్లడించారు.లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా మంత్రి ఈ విషయం తెలియజేశారు. 2026 జూన్ లోగా గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లను స్మార్ట్ సిటీ మిషన్‌లో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించిందా? ఈ నగరాల్లో అమలవుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు, వాటిలో పూర్తైనవి, ప్రగతిలో ఉన్నవి, వ్యయ వివరాలు వంటి అంశాలపై డాక్టర్ కావ్య సమాచారం కోరారు.దీనికి స్పందనగా మంత్రి టోఖన్ సాహూ, ఇప్పటికే మిషన్ ముగిసినందున కొత్త నగరాలను చేర్చే అవకాశమే లేదన్నారు. అలాగే, మిగిలిన నగరాల్లో ప్రాజెక్టుల పూర్తి కోసం సమయాన్ని పొడిగించే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని పేర్కొన్నారు.ఈ ప్రకటన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాల మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అనిశ్చితి నెలకొంది. స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా అభివృద్ధి కలిగే అవకాశాలపై ఈ నగరాలు ఆశలు పెట్టుకున్నప్పటికీ, కేంద్ర నిర్ణయంతో ఆ ఆశలు అడుగంటాయి .