- ఎమ్మెల్యే మల్ రెడ్డికి మంచిరెడ్డి సవాల్.
- మంత్రి పదవిపై తప్ప ప్రజాసమస్యలు పట్టడం లేదని విమర్శ.
- రజతోత్సవ సభ విజయవంతానికి పిలుపు.
ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి నిజంగా దమ్ముంటే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ఇప్పుడే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలోని ఓ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.సొంత ఎజెండా కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననడం సిగ్గుచేటని తీవ్రస్థాయిలో విమర్శించారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని, సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం తిరుగుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. సంవత్సరన్నర కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని, గత ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలనే మళ్లీ మళ్లీ చేస్తూ ప్రజలను మోసం మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో తాను ప్రారంభించిన పనులకు నేడు తిరిగి శిలాఫలకాలు వేసి ప్రారంభిస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజా క్షేత్రంలో పదవులు శాశ్వతం కావనీ.. ప్రజల కోసం చేసే సేవే శాశ్వతమనీ స్పష్టం చేశారు. గత 15 ఏళ్ల కాలంలో తాను చేసిన అభివృద్ధి నేటికీ గ్రామాల్లో తారసపడుతోందని చెప్పారు.తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని మండిపడ్డారు. ఫార్మాసిటీ రద్దు పై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.ప్రజల కోసం పని చేస్తే పదవులు వాతంతటవే వస్తాయని హితవు పలికారు.
- రజతోత్సవ సభను విజయవంతం చేయాలి.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేద్దామని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ సభపై ఆ పార్టీ భువనగిరి పార్లమెంటు ఇంచార్జి క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డితో కలిసి నియోజకవర్గ, మండల, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశమయ్యారు.సభను విజయవంతం చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకొని, భారీ జనసమీకరణపై దిశానిర్దేశం చేశారు.సమావేశంలో రాష్ట్ర నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, దండెం రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎస్వీ రమణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, మాజీ ఎంపీపీ కృపేశ్, మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్, నాయకులు చీరాల రమేష్, బుగ్గరాములు, జేర్కొని రాజు, నిట్టు జగదీశ్, వెంకట్ రెడ్డి, భారత్ రెడ్డి, శివ సాయి తదితరులు పాల్గొన్నారు.
