ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో ఉన్న దేవాలయం 60 వేల అడుగులకు చేరనుంది. ఆలయానికి కొత్త శిఖరాలు, మండపాలతో పాటు మాడ వీధుల రూపురేఖలు కూడా మారనున్నాయి. వేద మంత్రాల మధ్య గడ్డపారతో త్రవ్వి పనులకు శంకుస్థాపన చేశారు. రానున్న గోదావరి పుష్కరాల వరకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా బాసర అభివృద్ధి పనులన్నీ పూర్తయితే యాదాద్రి తరహాలో దేవాలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, మహేశ్వర్ రెడ్డి, బొజ్జు పటేల్, దేవాదాయ అధికారులు, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తదితరులు పాల్గొన్నారు.