గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముద్ర ప్రతినిధి, మెదక్:*
నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకు వెళుతుండగా గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌ను మెదక్ జిల్లా పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పెద్ద శంకరంపేట్ హైవే మీదుగా వెళుతున్న సమాచారం అందుకున్న మెదక్ డి.ఎస్.పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట సమీపంలోని కింగ్స్ 9 రెస్టారెంట్ వద్ద ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ నేతృత్వంలో బీజేపీ, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై నిరసన కొనసాగించారు. హైదరాబాదు నుంచి పిట్లం, బిచ్కుంద వైపు వెళ్తున్న బస్సును ఆపివేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనకారులు బస్సు అద్దంపై చేతితో బలంగా బాధడంతో స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి.
మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.

అరెస్ట్ అన్యాయం: రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఇక్కడ పోటీసులు అరెస్ట్ చేయడం వల్ల కార్యకర్తలను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఓలా గ్రామ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ కూడా కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.