Take a fresh look at your lifestyle.

జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం

ముద్ర ప్రతినిధి , కోదాడ …..

రాబోయే  జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు కీలకమని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

జిల్లాలో జనాభా గణన-2027ను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి సెక్షన్ క్లార్క్ లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు మార్చి 20, 22, 23 తేదీలలో మూడు రోజుల పాటు ఇళ్ల జాబితా, గృహ గణన (HLO) శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా గణన నిర్వహణకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశగా ఇళ్ల జాబితా (హౌస్ లిస్టింగ్) మరియు గృహ గణన మే 11 నుంచి జూన్ 9, 2026 వరకు, రెండో దశగా జనాభా గణన 2027 ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారు.

జనాభా గణన ద్వారా లభించే గణాంకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈసారి జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్ లు , వెబ్ పోర్టల్ ద్వారా గణన చేపడతారని, ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన సందర్భంగా ఇంటి నిర్మాణం, పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీరు, మురుగు పారుదల, మరుగుదొడ్లు, వంటగది వంటి సౌకర్యాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 34 ప్రశ్నలపై ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, సీపీఓ కిషన్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. జనాభా గణాంక అధికారి రవీంద్ర నాయక్ మండలాల వారీగా గణన బ్లాకుల విభజన, గణన విధానం పై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వి. రామారావు, ఉప గణాంక అధికారి ఎం. రాజేష్, బి. కోటేశ్వరరావు, పర్యవేక్షకులు దున్న శ్యామ్, మండల ప్రణాళికా గణాంక అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.