ముద్ర, తెలంగాణ బ్యూరో :
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియమితులయ్యారు. ఆయనతో పాటు కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేష్ గుండు రావునూ ప్రత్యేక అబ్జర్వర్‌గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం ఈ ప్రకటన విడుదల చేశారు. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం. ఇది పుదుచ్చేరి, కారైకల్, మాహె, యానాం నాలుగు జిల్లాలను కలిగి ఉంది. వీటి పరిధిలో 30 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. కాగా పుదుచ్చేరి అసెంబ్లీ 15వ సమావేశ కాలం 2026 జూన్ 15తో ముగియనుంది. 2021 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 16 స్థానాలతో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. తాజాగా ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కాంగ్రెస్ తన జెండా ఎగురవేయాలని భావిస్తున్నది.