ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఖర్చుల ఆదాయ-వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి తెలిపారు.
కేంద్ర ఎన్నికల చట్టం, 1951 మరియు ఎన్నికల నియమావళి ప్రకారం, గెలిచిన వారు, ఓడిపోయిన వారు అనే తేడా లేకుండా ప్రతి అభ్యర్థి ఎన్నికల లెక్కింపు తేదీ నుండి 45 రోజుల్లోపు తమ ఖర్చుల వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో, మీ ఎన్నికల లెక్కింపు తేదీ ఆధారంగా 45 రోజుల గడువు మార్చి 28, 2026తో ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల, అభ్యర్థులు మార్చి 28లోపు తమ ఆదాయ-వ్యయ వివరాలను సమర్పించాలని సూచించారు.
గడువు లోపు వివరాలు సమర్పించని పక్షంలో, ఎన్నికల నియమాల ప్రకారం అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండడంతో పాటు భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయడంపై కూడా నిషేధం విధించబడవచ్చని హెచ్చరించారు.
ఖర్చుల వివరాలు సమర్పించడానికి అవసరమైన ఫార్మాట్ మరియు మార్గదర్శకాలు మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.