వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు – నాణ్యమైన వైద్య సేవలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్ రాజనర్సింహ
నాగర్ కర్నూల్, ముద్ర ప్రతినిధి:
రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను బలోపేతం చేయడంతో పాటు వైద్య విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర సేవల విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే తెలకపల్లి మండల కేంద్రంలో రూ.1.59 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తూ, కమిషనర్ సృజన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు, హార్ట్ స్ట్రోక్‌లు, విషజ్వరాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్రిటికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ వంటి మారుమూల ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, ఆధునిక పరికరాల ఏర్పాటు వేగంగా జరుగుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, నర్సుల ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ స్థాయిలో నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 43 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్ సేవలను విస్తరించడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 35 మెడికల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యా బోధన అందిస్తున్నట్లు తెలిపారు. హాస్టల్ సౌకర్యాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్లినికల్ ట్రైనింగ్ వంటి అంశాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మెడికల్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు హాస్టల్, స్టైపెండ్, క్లినికల్ ట్రైనింగ్ తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిని 550 పడకల సామర్థ్యానికి అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, డీఎంహెచ్వో రవి నాయక్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, వైద్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.