Take a fresh look at your lifestyle.

హోరెత్తిన ఓరుగల్లు

  • గులాబీ మయమైన ఎల్కతుర్తి
  • ఉదయం నుంచే సభాస్థలికి పార్టీ శ్రేణులు
  • పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జాం
  • వాహనాలను క్లియర్​ చేసిన మాజీ మంత్రి హరీశ్​రావు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్సవ సభా ప్రాంగణం జ‌న‌సంద్రంగా మారింది. పార్టీ నేతలు అనుకున్నట్టే భారీగా జనం వచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం త‌ర‌లివ‌చ్చారు. స‌భా ప్రాంగ‌ణ‌మంతా చీమల దండులా త‌ల‌పించింది. స‌భా ప్రాంగ‌ణానికి దాదాపు నాలుగైదు కిలోమీట‌ర్ల వ‌ర‌కు జ‌నం బారులు తీరారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన ఎల్​ఈడీ స్క్రీన్లలో కేసీఆర్​ ప్రసంగం విన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి స‌భా ప్రాంగ‌ణంలో క‌ళాకారుల ఆట‌పాట‌ల‌కు జ‌నం ఉర‌క‌లేస్తూ.. ఉత్సాహంతో డ్యాన్స్‌లు చేశారు. సభలో గులాబీ జెండాల‌ను రెప‌రెప‌లాడిస్తూ.. బీఆర్ఎస్ పార్టీకి మ‌ద్దతుగా నిలిచారు.ఇక, సభను నిర్వహించిన ఎల్కతుర్తికి నలువైపులా.. కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు బారులు తీరాయి. జ‌నాలు త‌మ వాహ‌నాల‌ను దిగి న‌డ‌క‌దారిన ఎల్కతుర్తికి త‌ర‌లివ‌చ్చారు. కేసీఆర్ ఎల్కతుర్తి స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోగానే.. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాల‌తో స‌భా ప్రాంగ‌ణం ద‌ద్దరిల్లిపోయింది.

  • గ్రామాల నుంచి దండుగా..!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు పోటెత్తటంతో వరంగల్ దారులన్ని గులాబీ మయమయ్యాయి. ఈ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ పాటలు, నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలు గులాజీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని నింపాయి.నేతలు సైతం..కార్యకర్తలను ఉత్తేజితపరుస్తూ.. బీఆర్ఎస్ పాటలకు మాస్ స్టెప్పులేస్తూ వేడుకలను రక్తికట్టించారు. ఈ రజతోత్సవ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రికార్డు స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 1,213 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగా..సమావేశానికి హాజరయ్యే లక్షల మంది గులాబీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా..తా త్కాలిక కంట్రోల్‌ కమాండ్‌ సెంటర్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే 9014206465 నంబర్‌కు ఫోన్‌ చేశారు.ఇక, ఆదివారం జరిగిన రజతోత్సవ జాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు దండుగా కదిలారు. ఊరు, వాడ ఏకమై అటు జెండా పండుగను ఘనంగా నిర్వహించుకోగా ఇటు ఎల్కతుర్తికి పయనమయ్యారు.

  • ట్రాఫిక్​ క్లియర్​ చేసిన మాజీ మంత్రి హరీశ్​

ఎల్కతుర్తికి ఎటూ నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్​ జాం అయింది. దీంతో వరంగల్​ నుంచి వచ్చే రోడ్డులో మాజీ మంత్రి హరీశ్​రావు స్వయంగా ట్రాఫిక్​ క్లియర్​ చేశారు. కేసీఆర్​ సభకు వచ్చే ముందు వరంగల్​ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్​ ఆగిపోయింది. ఈ ట్రాఫిక్​లో మాజీ మంత్రి తలసాని చిక్కుకుపోయారు. ఇక, సభా వేదికపై గాయ‌కుల పాట‌ల‌కు మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి మాస్ స్టెప్పుల‌తో దుమ్మురేపారు. స‌భా వేదిక‌పై ఉన్న నేత‌లంతా కూడా మ‌ల్లారెడ్డితో క‌లిసి స్టెప్పులేశారు. దీంతో జై మ‌ల్లన్న, జై తెలంగాణ అనే నినాదాల‌తో మార్మోగిపోయింది. స‌భా ప్రాంగ‌ణంలో ఉన్న గులాబీ సైనికులు కూడా మ‌ల్లారెడ్డి స్టెప్పుల‌తో ఊగిపోయారు. కార్యక‌ర్తలు సైతం డ్యాన్స్ చేసి గులాబీ పార్టీ ప‌ట్ల త‌మ అభిమానాన్ని చాటుకున్నారు.

  • కొన్నిచోట్ల అడ్డంకులు

ఓరుగ‌ల్లు గ‌డ్డ మీద ఎల్కతుర్తి వేదిక‌గా కొన‌సాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్సవ స‌భకు పోలీసులు కొన్నిచోట్ల ఆటంకాలు సృష్టిస్తున్నారు.అత్సుత్సాహం ప్రద‌ర్శిస్తూ..గులాబీ పండుగ‌కు త‌ర‌లివ‌స్తున్న జ‌నాల‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఎల్కతుర్తికి వ‌చ్చే న‌లు వైపులా దారుల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎల్కతుర్తికి చేరుకునే మార్గాల్లో లారీల‌ను అడ్డం పెట్టి.. బీఆర్ఎస్ స‌భ‌కు త‌ర‌లివ‌స్తున్న ప్రజ‌ల‌కు పోలీసులు ఆటంకం క‌లిగించారని ఆరోపణలు వచ్చాయి.పోలీసుల వైఖ‌రితో ఎటు చూసినా దాదాపు 12 కిలోమీట‌ర్ల మేర వాహ‌నాలు నిలిచిపోయాయి.ఈ సందర్భంగా పోలీసులు స‌హ‌క‌రించాల‌ని, చెడ్డ పేరు తెచ్చుకోవ‌ద్దని స‌భా వేదిక నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు పోలీసుల‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజ‌ల‌ను, వాహ‌నాల‌ను స‌భా ప్రాంగ‌ణానికి అనుమ‌తించాల‌ని కోరారు. ప్రభుత్వ పెద్దల మాట‌లు విని పోలీసులు చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పారు.

  • నేలకు వందనం అంటూ..!

ఇక, రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్​ ప్రసంగానికి ముందు “ వరంగల్ నేలకు వందనం.. అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు” అంటూ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేసీఆర్ నివాళులు అర్పించారు.

  • ఇదో చరిత్ర : కేటీఆర్​

తెలంగాణ ఉద్యమానికి, బీఆర్​ఎస్​ పార్టీ ప్రస్థానానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి అని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవం సందర్భంగా గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్​ విగ్రహాలకు కేటీఆర్​తోపాటు ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ మొత్తం 25 ఏళ్ల బీఆర్​ఎస్​ ప్రస్థానానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు.25 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో కేసీఆర్ సారథ్యంలో తమ పార్టీ పురుడు పోసుకుందని గుర్తుచేశారు.ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం లక్షల మందితో బలోపేతమై తెలంగాణను సాధించిందని పేర్కొన్నారు.పార్టీ పుట్టిన జల దృశ్యం స్థలంలో పార్టీ రజతోత్సవ సంబురానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి లక్ష్మణ్ బాపూజీ కొండంత అండగా నిలిచారని, ఆయనకు వినమ్ర నివాళి అర్పిస్తున్నామని తెలిపారు.బీఆర్​ఎస్​ పార్టీకి ఆనాడైనా ఈనాడైనా తెలంగాణనే ఏకైక ఎజెండా అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతోందని ఉద్ఘాటించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ తలవంచి వినమ్ర నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు.సంవత్సరాలు నిండి అమరవీరుల ఆశీస్సులతో పాటు, పెద్దల ఆశీర్వాదాలతో మరో 25 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు. రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్​ అన్నారు.

  • వేదికపై రసాభాస

రజతోత్సవ సభ ప్రారంభానికి ముందు వేదిక మీద రసాభాస చోటు చేసుకొంది. రజతోత్సవ సభలో.. అందరూ చూస్తుండగానే వేదిక మీద గులాబీ నేతలు కుమ్ములాటలాడుకొన్నారు. దీంతో ఒక్కప్పుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అంటే భయం ఉంటుండే.. ఇప్పుడు పార్టీలో క్రమశిక్షణ తప్పిందనే ఓ చర్చ అయితే వైరల్ అయింది. పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎంట్రీ కోసం పాట పాడమని సింగర్‌ను నిర్వాహకులు వేదిక మీదకు పంపారు. అయితే పార్టీలోకి ఓ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీవ్ర అసహనంతో బౌన్సర్లను పెట్టి సింగర్‌ను కిందకి బలవంతంగా దింపేశారు. దీంతో వేదిక మీదనే గులాబీ నేతలు కొట్టుకొంటూ పార్టీ ఇజ్జత్ తీస్తున్నారనే ఓ ప్రచారం హల్ చల్ చేస్తోంది.అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Leave A Reply

Your email address will not be published.