ముద్ర, సూర్యాపేట:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని ఆయన సమీక్షించారు.
పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించిన ఎస్పీ, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారికి భరోసా కల్పించాలని తెలిపారు.
అలాగే, ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే స్పందించి కేసులు నమోదు చేయాలని, సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ‘ఆపరేషన్ రోప్’ను సమర్థవంతంగా అమలు చేయాలని, ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని ఎస్పీ పేర్కొన్నారు. సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.
ఈ తనిఖీలో ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, ఐలయ్య, మహేందర్ నాథ్, శివతేజ తదితరులు పాల్గొన్నారు.