Take a fresh look at your lifestyle.

దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘన నివాళులు

ముద్ర,సూర్యాపేట,  :

తెలంగాణ సాయుధ పోరాట తొలి వీరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

రాజకీయ, సామాజిక రంగాలలో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురయ్య ఆశయాలు నేటికీ ప్రాసంగికంగా ఉన్నాయని, రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు. యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ సమాజంలో న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహులు మాట్లాడుతూ, జనగాం జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకం కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమురయ్య, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి దారి చూపిన వీరుడని అన్నారు. ఆయన అమరత్వం ఉద్యమానికి మలుపుతిప్పిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిటిడిఓ శంకర్, వివిధ సంఘాల నాయకులు జి. సత్యనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, చిన్న శ్రీరాములు, వి. సత్యనారాయణ, హుస్సేన్, రాజయ్య, లింగయ్య, పి. గామయ్య తదితరులు పాల్గొన్నారు. సంబంధిత అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

— జిల్లా పౌర సంబంధాల అధికారి, సూర్యాపేట

Leave A Reply

Your email address will not be published.