ముద్ర ప్రతినిధి, మెదక్:
వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లడం లేదని, వాస్తవమేదో అవాస్తవమేదో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్రమ అరెస్టులు, దాడులు అంటున్నారు, జరుగుతున్న పరిణామాలన్ని ఓడిపోయిన వ్యక్తులు సింపతి పొందడానికే చేస్తున్న కుట్రలని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో 15 వార్డు నుండి పోటీ చేసిన నాపై దాడి చేసేందుకు పదుల సంఖ్యలో మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తన అనుచరులతో మా మద్దతు దారులైన ఓ మహిళ ఇంటి ముందు చేరి భయబ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న ఎమ్మెల్యే ఆమెను పరామర్శించేందుకు రావడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే అక్కడికి వచ్చింది డబ్బులు పంచేందుకు కాదని, ఆయనకు డబ్బులు పంచాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పట్టణానికి కావాల్సిన నిధులను సైతం తీసుకు వస్తున్నారు, ఇవన్నీ చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. మెదక్ నియోజకవర్గంలోని మెదక్, రామయంపేట్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ జెండా ఎగరడానికి స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కారణమన్నారు. తనపై దాడి జరిగిన రాత్రి ఏం జరిగిందనే వాస్తవాన్ని ప్రజలకు ఎందుకు తీసుకెళ్లలేక పోతున్నారని ఆయన ప్రశ్నించారు. మల్లికార్జున్ గౌడ్ తన అనుచరులను గుంపులు గుంపులుగా ఏర్పాటుచేసి ఎవరు వస్తే వారిపై దాడులు చేసేందుకు సిద్ధమయ్యారని, సిద్దిపేటలో హరీష్ రావు వేసిన స్కెచ్ ను ఇక్కడ అమలు చేశారన్నారు. నాపై గొడ్డలి తీసుకుని భయబ్రాంతులకు గురి చేసి చంపే కుట్ర చేశారని అన్నారు. దాడి చేసిన వారిపై ఎలాంటి పిర్యాదు చేయలేదని, మీరే ఫోటో లు, వీడియోలు తీసి ఫోన్ ద్వారా షేర్ చేశారన్నారు. ఎమ్మెల్యే వాహనంపై, తనపై దాడులు జరిగిన విషయం వాస్తవం కాదా, మీ కళ్లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. జరిగిన దాడిపై ఎక్కడ స్పందించకూడదని దీనికి ప్రజలే సరైన సమాధానంగా ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారన్నారు. ఏ ఒక్కరిపై కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. వారికి బెయిల్ ఎందుకు రాలేదు, మీకు బెయిల్ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జైల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల సింపతి పొందేందుకే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక మీదట కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే, హనుమంతరావులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, పట్టణ పార్టీ అధ్యక్షులు గంగాధర్, కౌన్సిల్లర్లు హరిత, సంపత్, మన్సూర్, మాజీ కౌన్సిలర్లు మధుసూదన్ రావు, లక్ష్మినారాయణ తదితరులున్నారు.