ముద్ర ప్రతినిధి, మెదక్:
మండల కేంద్రం చేగుంటలో డబ్బుల కోసం భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు.
2015లో మృతురాలు వరలక్ష్మి, నిందితుడు ముఠా త్రిమూర్తులకు రెండో వివాహం జరిగింది. వివాహానంతరం నిందితుడు ఇల్లరికం వచ్చి చేగుంటలో నివాసం ఉంటూ వచ్చాడు. వీరికి దుర్గాప్రసాద్ (10) అనే కుమారుడు ఉన్నాడు.
రెండు సంవత్సరాల క్రితం కుటుంబ పోషణ కోసం వరలక్ష్మి కాళ్ళకల్ ఐటిసి కంపెనీలో ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిందితుడు ఎలాంటి పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ భార్యను డబ్బుల కోసం వేధించేవాడు. తరచూ జరిగే గొడవలతో భార్యపై ద్వేషం పెంచుకున్న నిందితుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 21న అర్ధరాత్రి భార్య, కుమారుడు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న పా
రతో వరలక్ష్మి తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృతురాలి వద్ద ఉన్న 39.55 గ్రాముల బంగారు పుస్తెలతాడు, రూ.5 వేల నగదు, సెల్ ఫోన్ తీసుకుని అన్నవరం పారిపోయాడు.
నమ్మదగిన సమాచారం మేరకు రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి ఆదివారం ఉదయం చేగుంట బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు పుస్తెలతాడు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకట్ రాజ గౌడ్ వివరించారు.
ఈ కేసును ఛేదించిన రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, తూప్రాన్ సీఐ రంగకృష్ణ, చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, ఎస్ఐ భిక్యా నాయక్, కానిస్టేబుళ్లు భాస్కర్, రాజశేఖర్, సాజిద్ అలీ, హోంగార్డ్ రవీందర్‌లను మెదక్ జిల్లా ఎస్పీ అభినందించారు.