నేడు పుర ఎన్నికల ఫలితాలు
ఉదయం నుంచే మొదలు
ఏర్పాట్లు పూర్తి
గెలుపుపై ధీమా
ఇప్పటికే సగం మంది క్యాంపులో..
అన్ని పార్టీలు విప్ జారీ చేసేందుకు రెడీ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. ఈ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గత డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల జోరును కొనసాగించాలని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా, పట్టణ ఓటర్ల మద్దతుతో తిరిగి పుంజుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ బలాన్ని నిరూపించుకోవాలని బీజేపీ గట్టిగా పోటీనిచ్చింది. ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తు ముఖచిత్రాన్ని నిర్ణయించనున్నాయి.
పోలింగ్ సరళి తరువాత పార్టీలు లెక్కల్లో మునిగిపోయారు. కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల్లో పోలింగ్ జరిగిన తీరు… పోలింగ్ శాతం.. ఎంత మేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్ లో పాల్గొన్నారు… పోల్ మేనేజ్ మెంట్ పైనా సమీక్ష చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన లెక్కలను బేరీజు వేస్తున్నారు. అంతిమంగా ఫలితాల పైన ఒక అంచనాకు వచ్చారు. పోలింగ్ జరిగిన తీరు పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం 80 శాతం సీట్ల గెలుపుతో ధీమాగా కనిపిస్తోంది.
మిగిలింది ఫలితమే
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే పార్టీలు పోలింగ్ సరళికి అనుగుణంగా గెలుపు ఓటముల పైన ఒక అంచనాలకు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం తమ అంచనాలు వెల్లడించాయి. పోలింగ్ తీరు పైన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు నివేదిక ఇచ్చారు. 80 శాతం పైగా స్థానాలను పార్టీ గెలువబోతోందని చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ కే అధికంగా సీట్లు వస్తాయని వెల్లడించాయి. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్, బీజేపీ నేత లు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పట్టణ ఓటర్లు తమకే పట్టం కడతారని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 116 మున్సిపాలిటీ లు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలు దక్కుతాయని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా మినహా అన్నింటా కాంగ్రెస్ ఆధిక్యం ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్,-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు భావిస్తు న్నారు. పుర పోరు ప్రకటన వెలువడిన సమయం నుంచి ప్రచారం వరకు కాంగ్రెస్ పక్కా వ్యూహం తో ముందుకు సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, పలు జిల్లాల్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. సీఎం అమెరికాలో ఉన్నప్పటికీ జూమ్ మీటింగ్‌ల ద్వారా పార్టీ నేతలతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ ఏకపక్ష ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ పార్టీకి అనుకూలత ఉందని నేతలు చెబుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్ 26, బీజేపీ 5, ఎంఐఎం ఒక్క మున్సిపాల్టీ గెలుచుకునే అవకాశం ఉందని తాజాగా కాంగ్రెస్ నేతల అంచనా. మెదక్‌లో బీఆర్‌ఎస్ అత్యధిక మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో.. అధికారిక ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
కౌంటింగ్ ఏర్పాట్లు – ఫలితాల వెల్లడి
బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించి, గెలిచిన అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ఆపై మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పరోక్ష ఎన్నికలు జరుగుతాయి.
అంచనాలు సిద్ధం
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల అంచనాల్లో మునిగి తేలుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ఆరోపణలుచేయడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీ తాము వెనుకబడ్డామన్న సంకేతాలు ఇచ్చాయి
అయితే, పోలింగ్ ముగిసిన వెంటనే వినిపిస్తున్న రాజకీయ విశ్లేషణలు, పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం జరిగిన పోలింగ్ ముగిసింది. సుమారు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తుండగా, విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
బీఆర్ఎస్, బీజేపీల ఆరోపణలు
పోలింగ్ ముగిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు అధికార యంత్రాంగంపై మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసుల సహకారంతో తమ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మరోవైపు, బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి, అసలు తెలంగాణలో ఎన్నికల సంఘం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, అధికార పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు. సాధారణంగా ఎన్నికల్లో వెనుకబడిపోతామన్న భయం లేదా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించని సందర్భంలోనే విపక్షాలు ఇలాంటి గొంతు ఎత్తుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ 80 శాతం ధీమా
గత డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 80 శాతం మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని వారు భావిస్తున్నారు. 116 మున్సిపాలిటీల్లో కనీసం వంద చోట్ల గెలుస్తామని అంటున్నారు. ఏడు కార్పొరేషన్లలో ఐదు కార్పొరేషన్లలో గెలుస్తామని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్రితం సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి మాత్రం 20లోపు మున్సిపాలిటీలతో సరిపెట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
కార్పొరేషన్లలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి
ఈసారి కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడు కార్పొరేషన్లలో కనీసం ఒక్కటి కూడా గెలుచుకోకపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. పట్టణ ఓటర్లు ప్రధానంగా కాంగ్రెస్ , బీజేపీల మధ్య చీలిపోయే అవకాశం ఉండటం, బీఆర్ఎస్ కేడర్ లో కొంత స్తబ్దత నెలకొనడం ఆ పార్టీకి ప్రతికూల అంశాలుగా మారాయి. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉండటంతో అక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే మజ్లిస్, కాంగ్రెస్ పరస్పర సహకారంతో వాటిని కూడా గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. క
ఓటరు పల్స్ ఎటు?
పట్టణ ఓటర్లు ఈసారి మౌనంగా తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. పెరిగిన ధరలు, స్థానిక సమస్యలు వంటివి ప్రచారంలో చర్చనీయాంశాలు కాలేదు. లోకల్ పోల్స్ కావడంతో స్థానిక సమస్యలే హైలెట్ కావాల్సి ఉంది. కాకపోయినప్పటికీ ఓటర్లు ఇదే టాపిక్ ను తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకున్నట్లు క్షేత్రస్థాయి విశ్లేషణలు చెబుతున్నాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.