ప్రమాదాల నివారణ పై ఆహ్వాన కలిగి ఉండాలి
ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన
ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు అందజేత
ముద్ర, హైదరాబాద్ :
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు భాగస్వాముడు కావాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి పౌరుడు రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. వాహనాలు నడుపుతున్నప్పుడు హెల్మెట్, పీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపకూడదన్నారు. అతివేగాన్ని నివారించడం, ట్రాఫిక్ సిగ్నల్ను గౌరవించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్ధులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శనివరాం ముషీరాబాద్ డిపో లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రీజియన్ లో ప్రమాద రహిత, అత్యధిక సర్వీస్ ఇచ్చిన ముగ్గురు డ్రైవర్లకు ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రభుత్వం రవాణా శాఖలో ఎన్నో మార్పులు తెచ్చిందని ఆమె వివరించారు. రోడ్డు భద్రతపై ఆర్టీసీ డ్రైవర్లు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకం విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ ఎం. రాజశేఖర్ మాట్లాడుతూ డ్రైవర్లకు వాహనం నడపటం ప్రతిరోజు ఒక పరీక్ష అన్నాు. అయినా ప్రయాణీకులను సురక్షితం గా గమ్య స్థానానికి చేర్చుతున్నారన్నారు. ప్రయాణీకుల భద్రతకు ఆర్టీసీ ప్రాధాన్యమిస్తోందన్నారు. రీజినల్ మేనేజర్ సుధా పరిమళ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా నడుస్తున్న ఆర్టీసీ.. హైదరాబాదు రీజియన్ లో ప్రతి సోమవారం భద్రతా సోమవారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో అవగాహన, తెలివి, భావోద్వేగం, సంకల్పం గురించి వివరిస్తున్నట్లు చెప్పారు. రోడ్డు భద్రత పై అవగహన పెంచుటకు ప్రతి రోజు హైదరాబాద్ రీజియన్ లో ప్రతి ఉద్యోగి తో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించటం జరుగుతోందన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండటానికి సంస్థ ప్రతి డ్రైవరుకు తరచుగా శిక్షణ ఇస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెంట్ ధరించాలని, ఇతర వాహన దారులు, రోడ్డు నడిచే మీద వాడు బ్లైండ్ స్పాట్లను గమనించటం ద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చన్నారు. అంతకు ముందు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రోడ్డు భద్రతా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ముషీరాబాద్ డిపో నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, తాసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్ పాల్గొన్నారు.