- ఎయిమ్స్ లో ఫైబ్రోస్కాన్ సేవలు ప్రారంభం
బీబీనగర్, ముద్ర విలేకరి: రోగులకు అందించే వైద్య సేవలలో భాగంగా అత్యాధునిక వైద్య పరికరాలను పరిచయం చేయడం ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పనిచేస్తోందని కార్యనిర్వాహక సంచాలకుడు డాక్టర్ అహంతం శాంతాసింగ్ అన్నారు. రోగులలో కాలేయ సంబంధిత వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన ఫైబ్రో స్కాన్ సౌకర్యాన్ని శనివారం ఎయిమ్స్ లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనా పరమైన వైద్యసేవలకు మరింత విస్తృతం చేయడమే ఎయిమ్స్ ధ్యేయమని తెలిపారు. కాలేయ సంబంధిత వ్యాధుల నిర్దారణలో ఇదో ఆధునిక సాధనంగా ఉపకరమవుతుందని తెలిపారు. ఈ పరికరం ద్వారా హెపటైటిస్, ఫ్యాటీ లివర్, సిరోసిస్ వంటి దీర్థకాలిక వ్యాధులను త్వరితగతిన, అత్యంత కచ్చితమైన రీతిలో గుర్తించడానికి వీలవుతుందని తెలిపారు. శరీరాన్ని కోయాల్సిన అవసరం లేని నమ్మదగిన పరీక్షా పద్ధతిగా దీన్ని గుర్తించారని ఆయన వివరించారు. కాలేయ సంబంధిత వ్యాధుల నిర్ధారణలో ఇదో మైలురాయిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ అకడమిక్స్ డీన్ డాక్టర్ అశోక్ నితిన్ జాన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అభిషేక్ అరోరా, అదనపు ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ విశాఖ జైన్ తో పాటు ఇతర అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో రెసిడెంట్ మెడికోలు పాల్గొన్నారు.