- పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే హక్కు మీకు లేదు
- మీరు చేసిన తప్పులను మేం సరిదిద్దుతున్నాం
- చిరు ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించే విధానాన్ని రూపొందించాం
ముద్ర, తెలంగాణ బ్యూరో : పంచాయతీ కార్మికుల వేతనాలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు లేదని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఆయన ఆర్దిక మంత్రిగా ఉన్న సమయంలోనే నెలల తరబడి జీతాలు రాక పంచాయతీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వ పాలనలో పంచాయతీ కార్మికులకు నాలుగు నెలల నుంచి వేతనాలు అందలేదనీ, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ఉద్యోగులు మూడు నెలలుగా, మున్సిపల్ పారిశుద్ద్య కార్మికులు నెల రోజుల నుంచి వేతనాల కోసం ఎదురుచూస్తున్నారని చేసిన వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. మార్చి 13, 2023న పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ల ముందు వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు జీతాలు ఇవ్వకుండా అవస్థలకు గురి చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలతో ఆ పార్టీకి ఒనగూరేది ఏమీ లేదన్నారు. పంచాయతీ కార్మికులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు,టెక్నికల్ అసిస్టెంట్లు వేల మంది చిరు ఉద్యోగులను గత ప్రభుత్వం గుర్తించిన దాఖలాలు లేవన్నారు. గత పాలకులు చేసిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. వారి హయాంలో అన్యాయానికి గురైన వర్గాలను ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేస్తున్నట్లు వివరించారు. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించే విధానాన్నిరూపొందించి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇకపై 92 వేల మంది పంచాయతీ స్థాయి సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు తరహాలోనే జీతాలు అందించనున్నట్లు తెలిపారు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.