ఆహార కల్లీ నియంత్రణకు ప్రత్యేక వ్యవస్ధ
రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ
ఈగల్, హైడ్రా తరహాలోనే పకడ్బందీగా అమలు
ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న చట్టాలపై అధ్యయనం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా తీసుకొచ్చిన ఈగల్, హైడ్రా తరహాలోనే ఆహార కల్తీని నియంత్రించడానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్ట చర్యలు చేపడుతామని చెప్పారు.

రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ఇందులో సీఎంతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి మీడియాతో ముచ్చటించారు. రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడంతో ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదని చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం వివరించారు. ఇందుకోసమే క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు జారీ చేశామన్న సీఎం.. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామనీ వాణిజ్య ఇతర పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు.
సన్నబియ్యం పంపిణీకి ఏటా రూ.14,560 కోట్లు ఖర్చు-మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పేదలుకడుపునిండా భోజనం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన, లక్ష్యం
రాష్ట్రంలో 3.39 కోట్ల మంది సన్నబియ్యం లబ్దిదారులు
పేదలు గౌరవంగా, కడుపునిండా భోజనం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సన్నబియ్యం పంపిణీకి ఎంత ఖర్చయినా భరించడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సన్నబియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం ఏటా రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఆశయాలకు తెలంగాణలో పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతోందని ఉత్తమ్ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్ చేశారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలనే అద్భుతమైన ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి దేననీ ఆ ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలోని సుమారు 3.39 కోట్ల మంది సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి ఉత్తమ్ వివరించారు. అర్హులైన వారు ఎవరైనా సరే, రాజకీయాలకు అతీతంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ.40 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చేరుతున్నాయని, ఎక్కడా జాప్యం జరగకుండా పౌరసరఫరాల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
గృహ నిర్భందంలో కేసీఆర్…
మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారనీ కానీ తన అనుమానం ప్రకారం ఆయన కుటుంబీకులే ఆయన్ను గృహ నిర్బంధం చేశారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు జనానికి తెలిసేవి కావని చెప్పారు. రావణుడి చెడుతోనే రాముడి గొప్పతనం తెలిసిందన్న సీఎం.. కేసీఆర్ ఉండటంతోనే తనకు గుర్తింపు వచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డీలిమిటేషన్ పై బీజేపీ నేత లక్ష్మణ్ అవగాహన లేని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. లక్ష్మణ్ ఎలా డాక్టర్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణను చాలా తెలివిగా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని సీట్లు పెరిగితే అన్ని మహిళా రిజర్వేషన్లు వస్తాయని, ఒకవేళ 50 శాతం సీట్లు పెంచితే 410 సీట్ల గ్యాప్ వస్తుందని తెలిపారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగినా కూడా భౌగోళికంగా గ్యాప్ అలాగే ఉంటుందని అన్నారు. సీట్ల పెంపులో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి కేవలం ఐదు ఉత్తరాది రాష్ట్రాల సీట్లు సరిపోతాయని, అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లతో పని ఉండదని, ఇప్పటికే తమను పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పుడు ఎంతోకొంత దక్షిణాదిని గుర్తిస్తున్నారని, సీట్ల పెంపులో వ్యత్యాసం వస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు రాజకీయంగా అవకాశాలు ఉండవన్న ఆయన దేశంలో నియంత పోకడలు వస్తాయని సీఎం సెటైర్లు వేశారు.