2027 జనగణన నేపథ్యంలో స్పష్టత
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తమ బంధం స్థిరమైందని భావించే సహజీవన జంటలను కూడా వివాహిత జంటగానే లెక్కించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇరువురి సమ్మతంతో కలిసి ఉండే వారి విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేకుండా వారిని వివాహిత జంటలుగా గుర్తిస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న 2027 జనగణన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహజీవనం చేస్తున్న వారి విషయంలో స్పష్టత ఇచ్చింది.
సెన్సస్ వెబ్‌సైట్‌లోని ఎఫ్‌ఏక్యూ విభాగంలో కేంద్రం ఈ అంశాన్ని పొందుపరిచింది. ఈ మేరకు జనగణన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. కాగా 2027 జనగణనను అధికారులు మొత్తం రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ దశలో హౌస్ లిస్టింగ్ (ఇళ్ల జాబితా), గృహ గణన నిర్వహిస్తారు. దీని ద్వారా గృహాల పరిస్థితి, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఇంధనం, ఇంటర్నెట్ వంటి వసతులతో పాటు టీవీ, కంప్యూటర్, వాహనాలు వంటి ఆస్తుల వివరాలను సేకరిస్తారు. ఈ దశలో జనాభా గణన జరుగుతుంది. వ్యక్తుల పేరు, వయస్సు, లింగం, వైవాహిక స్థితి, కులం, మతం, విద్య, భాష, వైకల్యం, వలసలు, ఉపాధి వంటి పూర్తి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. (హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మంచు కురిసే ప్రాంతాల్లో ఇది సెప్టెంబర్ 2026లోనే జరుగుతుంది). ఈసారి జనగణనలో పౌరులకు ఒక ప్రత్యేక అవకాశం కల్పించారు. సాధారణంగా ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చి వివరాలు సేకరించే విధానంతో పాటు, పౌరులు తమ వివరాలను స్వయంగా వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకునే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వెబ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత, ఎన్యుమరేటర్ కేవలం ధృవీకరణ కోసం మాత్రమే ఇంటికి వస్తారు.