ముద్ర, ఆత్మకూర్(ఎం):
తాము చదువుకున్న పాఠశాలకు తమ వంతుగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయే విధంగా ఏదో ఒక సహాయం చేయాలని 1988-89 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు నిర్ణయించారు. పదవ తరగతి చదివి 37 సంవత్సరాలు పూర్తవడంతో పాటు వ్యక్తిగత వయస్సు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మకూరు లో ప్రత్యేకంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మకూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో పదవ తరగతి పూర్తిచేసినందులకు కృతజ్ఞతాపూర్వకంగా చిరస్థాయిగా, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండే విధంగా వితరణ అందించాలని పూర్వ విద్యార్థులు ఏకగ్రీవంగా తీర్మాణించారు. పాఠశాలలో ఉన్న వసతులు, విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించడంతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యాకమిటీతో చర్చించి అందిరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ‘బాల్యంలోని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలయాదిలో పూర్వ విద్యార్థుల 50 వసంతాల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సభ్యులంతా తమ తమ ఆత్మీయతను పంచుకున్నారు. బాల్య స్మృతులను గుర్తుచేసుకుంటా ప్రస్తుత పరిస్థితులను నెమరువేస్తూ తమ పిల్లలు, కుటుంబ సభ్యుల భవిష్యత్ గురించి ఆత్మీయంగా చర్చించుకున్నారు. హోదా, డబ్బు ప్రధానం కాదని, ఆప్యాయత – ఆత్మీయత తద్వారా కలిగే ఆరోగ్యమే ముఖ్యమని, అటువంటి పరిస్థితుల కోసం ప్రయత్నిస్తూ మిగతా జీవితాన్ని కొనసాగించాలంటూ సమ్మేళనంలో సభ్యులు తమ తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఆత్మకూర్ (ఎం)లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988-89 బ్యాచ్ గత 20 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోందని, ఈ స్ఫూర్తి, ఐక్యతను ఇలానే కొనసాగించే విధంగా అందరూ సహకరించుకోవాలని నిర్ణయించారు. 50 సంవత్సరాల వయస్సు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఒకరికొకరు మెమెంటోతో సత్కరించుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పూర్వ విద్యార్థులు మండలంలోని మొరిపిరాల గ్రామ ఉప సర్పంచ్ గా ఎంపికైన యాస జనార్థన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేతుల మీదుగా జిల్లా ఉత్తమ కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ అవార్డు అందుకున్న లోడి భాస్కర్ ను ఈ సందర్భంగా బాల్య మిత్రులు శాలువాతో సన్మానించి మెమెంటోతో సత్కరించారు. అనంతరం జరిగిన ‘ఆట-పాట’ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆడి-పాడారు.