అమల్లోకి ఎన్నికల నియామవళి
ప్రచార కార్యక్రమాలపై నిషేధం
అక్రమాలు, ఓటర్లను ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి ప్రత్యేక బృందాలు
11న పోలింగ్కు ఏర్పాట్లు ముమ్మరం
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా నిఘా పెట్టాలని జిలా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు
(ముద్ర ప్రతినిధి – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కీలకదశకు చేరుకున్నది. సోమవారంతో ప్రచారహోరు ముగిసింది. దీంతో బుధవారం పోలింగ్ కు రంగం సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నియామవళి మేరకు సోమవారం సాయంత్రం నుండే బహిరంగ ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అన్ని రకాల చర్యలను కట్టడి చేసేందుకు ఎన్నికల యంత్రాంగం రంగంలోకి దిగనుంది. ఈ మేరకు బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల నియామవళి సోమవారం సాయంత్రం నుంచే పక్కాగా అమలు చేసేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపడుతోంది. జిల్లాలో ఆమన్ గల్, చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, మొయినాబాద్, శంకర్ పల్లి మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 11న పోలింగ్కు పూర్తి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరోవైపు ఎన్నికలలో అక్రమాలు, ప్రలోభాలకు చెక్ పెట్టేందుకు సోమవారంసాయంత్రం 5.00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ముగిసేంత వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎవరు కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృందాలు ఎన్నికల నియామవళిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
మున్సిపాలిటీల పరిధిలోని పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉంటూ కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.
9న, 11న, 13న మద్యం, కల్లు దుకాణాలు బంద్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం 5.00 గంటల నుండి 11వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులను, కల్లు దుకాణాలను మూసివేయించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రై డే అమలు లో ఉంటుందని తెలిపారు.
మున్సిపాలిటీల పరిధిలో 10న, 11న విద్యాసంస్థలకు సెలవు
ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 10వ తేదీన సెలవు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అలాగే పోలింగ్ రోజు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల పరిధిలో అన్ని ప్రవేటు / ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ / ప్రైవేటు సెక్టార్ సంస్థలు , వాణిజ్య సంస్థలకు సెలవును ప్రకటించామని వెల్లడించారు. దీంతో ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు తప్పనిసరిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.