సీఎం రేవంత్ తో వడ్డేపల్లి ఏఐఎఫ్ బి కౌన్సిలర్ల భేటీ పార్టీ మారట్లేదని స్పష్టీకరణ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని వ్యాఖ్య
ముద్ర, తెలంగాణ బ్యూరో :
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్ బి) కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లిహీల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు సీఎంతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. సీఎంతో భేటీ తర్వాత.. బయట మీడియాతో మాట్లాడిన వడ్డేపల్లి శ్రీనివాస్… తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాము పార్టీ మారడం లేదన్న ఆయన కేవలం తమ మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం కోరేందుకే సీఎంను కలిశామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందనీ నిధుల విషయంలో సానుకూలంగా స్పందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు.