- ఆమె పార్టీలో చేరితే అభ్యంతరాలు లేవు.
- కవిత మాటలను కాంగ్రెస్ లో ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు.
- ఆపరేషన్ కగార్ పై శాంతి చర్చల ప్రతిపాదన వస్తే ఎందుకు స్వాగతించొద్దు.
- ఆపరేషన్ సిందూర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నలకు బీజేపీ సమాధానం చెప్పాలి.
- మీడియాతో ప్రభుత్వ సలహాదారు కేశవరావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరితే పార్టీకి పెద్దగా ఒరిగే ప్రయత్నం ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అభిప్రాయపడ్డారు. ఆమె చేరికతో కాంగ్రెస్ పార్టీకి నిజంగానే లాభం చేకూరుతుందని అని అనుకుంటే ఆమె చేరికపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత మాటలను కాంగ్రెస్ లో ఎవరూ సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించడం లేదన్నారు. తాను మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని కాంగ్రెస్ లోనే చస్తానన్నారు. తెలంగాణ ఇవ్వనందునే తాను గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి భావోద్వేగంతో దేశం గర్వించదగ్గ లాగా మాట్లాడారని కేకే వ్యాఖ్యానించారు.రాహుల్ గాంధీ అడగని ప్రశ్నలు రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అడిగారన్నారు. ఇప్పటి వరకు మనం ఎంత నష్టపోయాం, ఎన్ని జెట్ విమానాలు కోల్పోయాము అనేది కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. పెహల్గం ఘటన కారకులు ఎంత మందిని గుర్తించారు. వారిలో ఎంత మంది దొరికారో సమాధానం చెప్పాలని కేశవరావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ ల మధ్య ప్రధానంగా ఆరు యుద్ధాలు జరిగాయని చెప్పారు. అయితే పెహల్గం ఘటన తర్వాత మన దేశం ఏదో చేస్తున్నట్లు కేంద్రం పెద్దగా క్రియేట్ చేసింది తప్ప ఏమి జరగలేదని చెప్పారు. ఎవరో సంబంధం లేని వ్యక్తులు యుద్ధం లేదని సీజ్ ఫైర్ అయ్యిందని ఎలా చెపుతారని పాకిస్తాన్, భారత్ ల యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి చెప్పారు. అసలు మిలిటరీ చేసే పనులలో రాజకీయ ప్రమేయం అవసరమే లేదన్నారు. సీజ్ ఫైర్ కాకపోతే పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించేదని వ్యాఖ్యానించారు. భారత్ యుద్ధం గెలిచిందని అంతర్జాతీయ పత్రికలు, మీడియా ఎక్కడైనా వార్తలు రాశాయా అని ప్రశ్నించారు. మన పేపర్ లో తప్ప వేరే వాళ్లు ఎవరు రాయలేదన్నారు. ఇప్పుడు భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిందని ఏ దేశం చెప్పడం లేదని కేశవరావు చెప్పారు. ఆపరేషన్ కగారుపై స్పందిస్తూ శాంతి చర్చలకు వస్తామని ఓ వైపు నుంచి ప్రతిపాదన వస్తే దాన్ని ఎందుకు స్వాగతించకూడదన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగే ఆపరేషన్స్ గురించి తాను పార్లమెంట్లోనే మాట్లాడానని చెప్పారు.