Take a fresh look at your lifestyle.

విలువైన భూములు అమ్మిందెవరూ.?

  • విలువైన ప్రభుత్వ భూములను తక్కవు ధరలకే సొంత నేతలకు అంటగట్టారు.
  • చంద్రబాబు, వాజ్‌పేయి హయాంలోనే హెచ్‌సీయూ భూములను బిల్లీరావు అమ్ముకున్నారు.
  • ఐఎంజీ భరత్ సంస్థతో 33 శాతం ముడుపులు తీసుకునేలా కేటీఆర్ మాట్లాడుకున్నారు.
  • మీడియాతో టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను బీఆర్ఎస్ నాయకులు గతంలోనే అమ్ముకున్నారని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్​ ఆరోపించారు.వాటిని అతి తక్కువ ధరకే తమ సొంత పార్టీ నేతలకు అప్పజెప్పారని మండిపడ్డారు.శుక్రవారం గాంధీభవన్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నేడు హైదరాబాద్‌లో కొండలను కూడా కరిగించి పనులు జరుగుతున్నాయని, ఆ భూములను అమ్మింది బీఆర్​ఎస్​ నేతలే అన్నారు.గత పదేళ్లలో హైదరాబాద్ భూములను మాయాజాలం చేసి ఎకరా రూ.100 కోట్లకు అమ్ముకున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లోనే 10 వేలకుపై చిలుకు భూములను అడ్డగోలుగా అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు.హెచ్‌సీయూ భూముల విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎవరు ఎవరి పాలనలో భూములు అమ్మారో ఆ చరిత్ర ప్రజలకు తెలియాలని చెప్పారు.చంద్రబాబు, వాజ్‌పేయి హయాంలో హెచ్‌సీయూ భూములను ఐఎంజీ భరత్ అనే సంస్థకు చెందిన బిల్లీరావుకు అమ్మారని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.తర్వాత దివంగత రాజశేఖర్ రెడ్డి పోరాటంతో ఆ భూములు ప్రభుత్వానికి దక్కాయని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.అయితే ఆ తర్వాత వచ్చిన కేసీఆర్.. హెచ్‌సీయూ భూములతో పాటు పలు యూనివర్సీటీలకు చెందని భూములను కూడా దోచుకోవాలని చూశారని తెలిపారు. ఐఎంజీ భరత్ సంస్థతో 33 శాతం ముడుపులు తీసుకునేలా అప్పటి మంత్రి కేటీఆర్ మాట్లాడుకున్నారని తెలిపారు. కేటీఆర్‌కు రావాల్సిన ముడుపులు రూ.5,200 కోట్లను కాంగ్రెస్‌కు అంటగడ్డే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రూ.5,200 కోట్లు తీసుకుని హెచ్‌సీయూ భూములను బిల్లీరావుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పన్నంగా అప్పగించేదని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానివని, ఇందుకు బదులుగా 390 ఎకరాలు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. హెచ్‌సీయూ భూములను కాపాడింది రాజశేఖర్ రెడ్డి అని, వెనక్కి తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డిఅని వ్యాఖ్యానించారు.పదేళ్ల భూ దోపిడీపై దమ్ముంటే చర్చకు రండి అంటూ కేటీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ సవాల్​ చేశారు.ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్,ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, అమీర్ అలీ ఖాన్, ఎమ్మెల్యే గణేష్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.