- భద్రత చర్యలు, దొంగతనాల నివారణ పై అవగాహన.
కుషాయిగూడ, ముద్ర విలేఖరి: బంగారం దుకాణాల యజమానులు, పాన్ బ్రోకర్స్ తో కుషాయిగూడ పోలీసులు సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో కుషాయిగూడ ఏసిపి వై వెంకట్ రెడ్డి బంగారు ఆభరణాల దుకాణాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, దొంగతనాల నివారణ అంశాలపై అవగాహన కల్పించారు.ఇక బంగారు ఆభరణాల దుకాణాలు, పాన్ బ్రోకర్స్ దుకాణాల్లో కచ్చితంగా సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆభరణాల భద్రతకు లాకింగ్ సిస్టంను పగడ్బందీగా ఉంచుకోవాలని సూచించారు. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణతో దుకాణాల యజమానులు, సిబ్బంది ఉండాలని, అనుమానిత వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఇక దొంగ బంగారం క్రయవిక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్సైలు బి శ్రీనివాస్, సతీష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.