ముద్ర, గద్వాల:
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కేటిదొడ్డి గ్రామపంచాయతీల్లో తహశీల్దార్ కరుణాకర్ అధ్యక్షతన గురువారం గ్రామసభలు నిర్వహించారు. గ్రామాలకు రెండున్నర ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ముద్రించిన కరపత్రాలను సభకు హాజరైన ప్రజలకు అందజేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు,మండల నాయకులు ఉరుకుందు హాజరయ్యారు. ఊరు వాడ సమగ్ర అభివృద్ధే గ్రామ సభల ప్రధాన లక్ష్యమని వారు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా గ్రామ సభలు వేదిక కావాలని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత వంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ, తహసీల్దార్ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.