సెబీ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
ముద్ర, తెలంగాణ బ్యూరో: వాస్తవాలు దాచి పెట్టి, నిబంధనలను ఉల్లంఘిస్తూ కంచెగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమంటూ సెబీ చైర్మన్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలు, ఆధారాలతో సెబికి గురువారం ఆయన ఒక లేఖ రాశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్ల అప్పులు టిజిఐఐసి ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను లేఖలో ఎండగట్టారు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటి ప్రకారం ఈ భూమి అటవీ భూమిగా గుర్తించిందని, “అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతాం” అని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.ఈ వాస్తవాలను దాచిపెట్టి, భూమిని తాకట్టు పెట్టి రుణాలు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమన్నారు. టిజిఐఐసి వార్షిక ఆదాయం రూ. 150 కోట్లు కన్నా తక్కువే అయినా వేల కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకల్లో పాల్పడటంలో భాగమేనని అన్నారు. ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడంలో పారదర్శకత లేదు, సెబీ నియమ నిబంధనలు పాటించారన్న విషయంలోనూ స్పష్టత లేదన్నారు.రుణ సేకరణ కోసం మధ్యవర్తులకు రూ.169.83 కోట్లు బ్రోకరేజ్ చెల్లించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.తెలంగాణ అటవీ సంపదను తాకట్టు పెట్టి, అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని హరీశ్ రావు సెబీకి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెబి నిబంధనలను ఉల్లంఘించిందంటూ హరీశ్ రావు లేఖలో పేర్కొన్నారు.
తుంగలో తొక్కిన నిబంధనలివే
1. 2003 ప్రకారం భౌతిక వాస్తవాలను తప్పుగా చూపడం, మోసపూరితంగా దాచిపెట్టడం నేరం.
2. 2021 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం తప్పుడు నివేదికలు చూపుతూ సెబీ నీ తప్పుదారి పట్టించే ప్రయత్నం.
3. 2015 ప్రకారం కంపెనీల నిర్మాణ మార్పులను, ఆర్థిక వివరాలను తప్పకుండా వెల్లడించాల్సిన బాధ్యత ఉంది, కానీ తెలంగాణ ప్రభుత్వం టీజీఐఐసీ వెల్లడించకపోవడం.
4. 1992 ప్రకారం మధ్యవర్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని నిజాలను వెల్లడించకపోవడం.
5. 992 సెక్షన్ 11(2)(i) ప్రకారం సెబీకి తప్పుడు సమాచారం, మోసపూరిత లావాదేవీలు చేయడం.
6. 2015 సెక్షన్ 4(2)(e) ప్రకారం పెట్టుబడిదారులకు పూర్తి, స్పష్టమైన సమాచారం అందించడం తప్పనిసరి కానీ తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నంగా వాస్తవాలను దాచిపెట్టడం.
7. కంపెనీల చట్టం,సెక్షన్ 13, 14 ప్రకారం ప్రైవేట్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి సరైన విధివిధానాలు పాటించకపోవడం.
8. ఆర్థిక స్థితి, అప్పుల చెల్లింపు సామర్థ్యం గురించి సరైన వివరాలు వెల్లడించకపోవడం సెబీ చట్టంలోని సెక్షన్ 15A, 15HA ఉల్లంఘనే కిందకు వస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు.