Take a fresh look at your lifestyle.

రాష్ట్ర సంస్కృతి ప్రతీక బోనాలు 

  • తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాలు.
  • తొలి బోనాన్ని,  పట్టు వస్త్రాలను సమర్పించిన అసెంబ్లీ స్పీకర్, మంత్రులు పొన్నం, కొండా.
  • అబ్బురపరిచిన పోతురాజు విన్యాసాలు.
  • భక్తి శ్రద్ధలతో వేలాదిగా అమ్మవారికి  బోనాలు సమర్పణ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకువెళ్లాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు.జగదాంబ అమ్మ ఆశీస్సులు తమ ప్రభుత్వంపై ఉండాలన్నారు. జగదాంబ మహంకాళి గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్  గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ  బల్మూరి వెంకట్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గోల్కొండ జగదాంబ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలన్నారు. వందేళ్ల క్రితం నుంచి జంట నగరాల్లో వైభవోపేతంగా బోనాల సాంప్రదాయం కొనసాగుతుందని చెప్పారు. గోల్కొండ జగదాంబ అమ్మ చాలా మహిమగల తల్లి అన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో నిర్వహించే  బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 20 కోట్లు ముందే మంజూరు చేసిందన్నారు.  హైదరాబాద్ ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ  గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత చరిత్ర ఉందని అన్నారు. జంట నగరాల్లో దారులన్నీ గోల్కొండ వైపే ఉన్నాయన్నారు.భక్తులు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు.  బోనాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.భక్తులు, ప్రజలకు పోలీసులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని మంత్రి సూచించారు.రాష్ట్ర నలుమూలల నుండి బోనాల పండుగ ప్రాముఖ్యతతో హైదరాబాద్ మహానగరానికి ప్రజలు, భక్తులు తరలివస్తున్నారని అన్నారు.తెలంగాణ బోనాలు సంస్కృతి,ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని మంతి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే మెరుగ్గా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆషాడ మాసంలో సంప్రదాయ రీతిలో గోల్కొండ జగదాంబ అమ్మకు తొలి బోనం సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ బోనాల నిర్వహణకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.అమ్మవారికి సమర్పించే బోనాల్లో భక్తులకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు బోనాల నిర్వహణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇందులో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట  ఏర్పాటు చేసినట్లు వివరించారు. తర్వాత స్పీకర్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తొలి బోనం ఎత్తుకొని పట్టు వస్త్రాలతో అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిబాబు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.